Telangana | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం దారుణంగా పడిపోయింది. నెలవారీ నిర్వహణ కూడా భారంగానే నడుస్తున్నది. ఇదే సమయంలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గించుకోవడం ద్వారా పైసలు ఆదా చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏయే విధంగా ఖర్చు తగ్గించుకోవాలో వివరంగా సూచించారు. ఇప్పుడు అధికారులు, ఉద్యోగుల్లో సీఎస్ ఉత్తర్వులపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది.
ఆఫీసులలో విద్యుత్ వాడకంలోనూ పొదుపు మంత్రం పాటించాలని సీఎస్ సూచించారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలన్నారు. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని కూడా తగ్గించాలని, అవసరం లేనప్పుడు వెంటనే చార్జింగ్ తీసేయాలని సూచించారు. సీఎస్ ఆదేశాలపై అధికారులు, ఉద్యోగులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు, ఇయర్ బడ్స్ చార్జింగ్ కూడా వృథా కిందకే వస్తుందా అని అంటున్నారు. తామేదో వృథా ఖర్చులు చేస్తున్నట్టుగా సీఎస్ ఉత్తర్వులు ఉన్నాయని అభ్యంతరం తెలుపుతున్నారు.
ప్రభుత్వం చెబుతున్న పొదుపు మంచిదే అయినా రాబడిపై దృష్టి పెట్టకుండా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. పొదుపు మంత్రం అధికారులు, ఉద్యోగులకేనా? మంత్రులకు కూడా వర్తిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐదు దేశాల్లో పర్యటించారని, మరోసారి అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారని గుర్తుచేస్తున్నారు. మంత్రులు నెలకొకరు విదేశాలకు వెళ్లి వస్తున్నారని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ విదేశీ టూర్లకు వెళ్లారని, పొదుపు పాటించడంతో పాటు దుబారా అరికట్టేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు పాటించాల్సిన పొదుపు సూచనలతో సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు స్టడీ టూర్లు, సెమినార్లు, వర్క్‌షాప్‌ల పేరుతో విదేశాలకు వెళ్లొద్దని తేల్చిచెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే, అతితక్కువ మందితో, తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయాలని సూచించారు. కార్యాలయాలు, అధికారిక నివాసాల్లో సౌకర్యాలు, వసతుల్లోనూ పొదుపు పాటించాలని పేర్కొన్నారు. వాహనాల కొనుగోళ్లపైనా నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేశారు.