హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అందరూ అటెన్షన్‌తో ఉండేవాళ్లు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు ఉన్నాయంటే సభాపక్షనేత సహా అధికార పార్టీ సభ్యులు పూర్తిస్థాయిలో హాజరయ్యేవారు. ముఖ్యంగా బడ్జెట్ వంటి ముఖ్యమైన వాటిపై చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులందరూ చర్చలో పాల్గొనాలని, నిర్లక్ష్యంగా ఉండవద్దని నాటి సభాపక్ష నేతగా కేసీఆర్ చెప్తుండేవారు. అంతేకాదు, శాసనసభ సమావేశాలు ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా సీఎం వచ్చేవారు. స్పీకర్ కూడా అనుకున్న సమయానికి శాసనసభను ప్రారంభించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. స్వయంగా ముఖ్యమంత్రే సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మంత్రుల హాజరూ అంతంత మాత్రంగానే ఉంటుంది. శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరుపైనా అనేక విమర్శలు వస్తున్నాయి.
సభ వాయిదాపడ్డప్పుడు తిరిగి ప్రారంభించేందుకు చెప్తున్న సమయానికి, ప్రారంభిస్తున్న సమయానికి తేడా ఉంటున్నదని పలువురు సభ్యులు లాబీల్లో వ్యాఖ్యానిస్తున్నారు. సభలో సరైన కోరమే ఉండటంలేదని చెప్తున్నారు. ఏదో ఒకరిద్దరు మంత్రులు మినహా అత్యధికులు వారి వారి శాఖల సమావేశాలు, ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నారని, సభలో సబ్జెక్టు ఎవరిదైతే ఉంటుందో వాళ్లు తప్ప మిగిలిన వారు రావడంలేదని చెప్తున్నారు. ఒక్కొక్కసారి మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఆయా శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.
సభ జరుగుతున్నా ఆగని ఢిల్లీ యాత్రలు
సభలో ప్రతపక్ష సభ్యులు నిండుగా కనిపిస్తుండగా, అధికార పక్షం నుంచి ఎప్పుడు చూసినా సగం మందికన్నా తక్కువ సంఖ్యలోనే సభ్యులు సభలో ఉంటున్నారు. ఈ నెల 12న గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదేరోజు రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఉన్నప్పటికీ, తొలిరోజు చర్చలో సీఎం పాల్గొనలేదు. 13న ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దలు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో భేటీ అయ్యారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకసారి ఢిల్లీకి వెళ్లివచ్చారంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ, రెండోసారి మళ్లీ సోమవారం మధ్యాహ్నం సభ జరుగుతున్నప్పుడే సభ నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఒక్క సీఎం మాత్రమే కాదు.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం వెళ్లారు.
మంగళవారం కూడా సీఎం, ఇతర మంత్రులు హైదరాబాద్‌కు రాలేదు, శాసనసభ సమావేశాల్లో పాల్గొనలేదు. ఇది ఇప్పటివరకు జరిగిన ఢిల్లీ పర్యటనకు సంబంధించినది మాత్రమే. గత శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే చన్నైకి వెళ్లి, నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. అలా గత శుక్రవారం సగం రోజు, శనివారం పూర్తిగా శాసనసభకే హాజరుకాలేదు. ముఖ్యమంత్రి శాసనసభ సమావేశాలు జరుగుతున్న రోజుల్లో ఇన్నేసి రోజులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, శాసనసభలో ఉండాల్సిన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు కూడా పట్టీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. పద్దులపై చర్చ జరిగే సందర్భంలో ఒక్కొక్కసారి అర్థరాత్రి వరకూ సభ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం కోరంనకు సరిపడ కూడా సభలో కనిపించడం లేదు. దీంతో విప్‌లు సభ్యుల కోసం తిరగడం లాబీల్లో కనిపిస్తున్నది.