సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): చూస్తుంటే తొండలకు తెలంగాణపైనో, తెలంగాణ ప్రభుత్వంపైనో ఏదో కోపం వచ్చినట్టుంది. అందుకే ప్రాణాలను బలిపెట్టి మరీ రాష్ట్రంలో కరెంటు కట్ అయ్యేలా చేస్తున్నాయి. బుధవారం ఒకే రోజు అటు జగిత్యాలలో, ఇటు హైదరాబాద్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. రెండు చోట్లా కరెంటు కట్ కావడానికి కారణం ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడటమే అని విద్యుత్తు సంస్థల సిబ్బంది వివరణ ఇచ్చారు. జనం, పైఅధికారులు నమ్ముతారో లేదోనని సాక్ష్యంగా రెండు ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడి ఉన్న ఫొటోలను సైతం వారు ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. జగిత్యాల సంఘటన బయటపడిన కొద్దిసేపటికే హైదరాబాద్ వ్యవహారం కూడా ఇలాగే జరగడం ఆసక్తికరంగా మారింది.
మరోవిశేషం ఏమిటంటే జగిత్యాలలో జిల్లా విద్యుత్తు విభాగానికి బాస్ అయిన ట్రాన్స్కో ఎస్ఈ, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతుండగానే కరెంట్ కట్ అయింది. ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజినీర్ గుండు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంతో పాటు, పరిశ్రమలు, గృహరంగాలకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతుండగానే కరెంట్ పోయింది. ఈ హఠాత్పరిణామంతో మాట్లాడుతున్న ఎస్ఈతో పాటు మీటింగ్కు హాజరైన విద్యుత్తు సిబ్బంది షాక్కు గురయ్యారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులతో పాటు అధికార పక్ష సభ్యులు ఒకింత వెటకారంగా నవ్వడం కనిపించింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఇస్తున్నామని ఎస్ఈ చెబుతున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఎస్ఈ పత్రికాప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని రామాలయం గ్రౌండ్ దగ్గరలోని ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్పై తొండ పడడంతో ధరూర్ సబ్స్టేషన్ లోని ఎల్వీ బ్రేకర్ ట్రిప్ అయి విద్యుత్తు అంతరాయం కలిగిందని వివరించారు. 90 సెకన్లలోనే తొండను తొలగించి, కరెంటును పునరుద్ధరించామన్న వ్యాఖ్యలపై సోషల్మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. – జగిత్యాల