పురుగుల, తెగుళ్ల దాడికి ఎండిపోతున్న పంటలు
యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్న వ్యవసాయాధికారులు
Paddy Crop | ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 11 : రైతులు సాగుచేసిన వరిపంటకు తెగుళ్లు సోకే అవకాశముందున్నందున సరైన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. యాసంగి వరిపంటపై తెగుళ్ల బెడద తీవ్రమైంది. సాగునీరు అధికంగా విడుదల అవుతుండడం, బోర్లు, బావుల ఆధారంగా చాలామంది రైతులు వరిపైరును సాగుచేశారు. పైరులో మొదటి నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే పైర్లు చీడపీడల ప్రభావానికి గురైతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వరిపైరును సుడిదోమ, మొగిపురుగు, పాముపొడ, తెగుళ్లు నల్లకంకి తెగులు పైరును ఆశించి నష్టపరుస్తున్నాయి. ఈ సమయంలో రైతులు సమగ్రమైన వ్యవసాయాధికారుల సూచనల మేరకు సరనై సస్యరక్షణ చర్యలు చేపడితే, తెగుళ్లను సకాలంలో నివారించి మంచి దిగుబడిని సాధించుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. కొన్నిచోట్ల నారుమడి దశలోనూ, మరికొన్ని ప్రాంతాల్లో పిలక దశలో ఉండగా, వారంరోజులుగా వాతావరణంలో మారిన పరిస్థితులతో కాండం తొలిచే, రెక్కల పురుగు ఆశిస్తున్నది. ఇంకా గుడ్ల సముదాయాలు కనిపిస్తున్నాయి. రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది పిలకదశలో కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉండగా, నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
మొగిపురుగు వరి పైరుకు నారుమడి దశ నుంచి పైరు పూర్తిగా గింజపోసుకునే దశ వరకు ఆశిస్తుంది. తల్లి పురుగు ముదురు రంగులో ఉండి. ముందు రెక్కలపై నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. ఈ పురుగులు గోధుమరంగు వెంట్రుకలతో కప్పిన గుడ్లను గుంపులుగా నారుమళ్లలో పెడతాయి. నాటిన పొలంలో అయితే మొక్కలు ఆకుల చివరి భాగాల్లో పెడతాయి. మొక్క పిలకలు తొడిగే దశలో ఈ పురుగు ఆశిస్తే పైరు మొవ్వలు ఎండిపోయి చనిపోతాయి. పురుగు ఆశించిన మొక్కల మొవ్వలు, కంకులును లాగితే అవి తేలికగా బయటకొస్తాయి.
– పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకుని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
– పిలక దశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి, అందులో వారానికి బుట్టకు 25-30పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
– పొలంలో గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువవుతుంది. ఈ క్రమంలో వారంరోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800గ్రాములు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా, 600గ్రాముల ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి.
– ఒకవేల నారుమడిలో వేయకపోతే 15రోజుల వయస్సున్న పిలకదశలో ఉన్న వరిపైరులో ఈ యాసంగిలో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 10కిలోలు లేదా, కార్బాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8కిలోలు లేదా, క్లోరాంట్రానిలిఫ్రోల్ 0.4జి 4 కిలోలు వేయాలి.
– కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లార్వా దశలో వరిపైరును నష్టపరుస్తున్నట్లు తెలిసింది. అలాంటి ప్రాంతాల్లో క్వినాల్ఫాస్ 2మి.లీ, ప్రొఫెనోఫాస్ 2మి.లీ, లేదా కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పైరును అధికంగా నత్రజనిని అందించడం వలన సుడిదోమ పైరులో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. గోధుమ వర్ణం కలిగిన ఈ సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ల వద్ద నీటిమట్టంపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తుంటాయి. దీంతో పంట సుడులు, సుడులుగా ఎండిపోతుంది. సుడిదోమను వెంటనే నివారించకపోతే పంటంతా కూడా దీని బారిన పడి పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది.
– రైతులు ప్రతినిత్యం వరిదుబ్బులు మొదళ్లను గమనిస్తూ ఉండాలి.
– వరిదుబ్బుకు 20కు మించి సుడిదోమలు కనిపిస్తే ప్రతి 2మీటర్లకు 30సెంటీమీటర్ల వెడల్పులో పాయలు తీసిగాలి వెలుతురు దుబ్బులకు తగిలే విధంగా చూడాలి.
– పొలంలో వెంటనే నీటిని తీసి ఆరుతడి పద్ధతిలో పైరుకు నీటిని అందించాలి.
– నత్రజని అధిక మొత్తంలో వాడకుండా తగిన మోతాదులోనే వేసుకోవాలి.
– వరిదుబ్బుకు 20 నుంచి 25వరకు దోమలు ఆశించి ఉంటే ఎకరాకు ఇమిడాక్లోప్రిడ్ 40మిల్లీలీటర్లు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
– 50నుంచి 100వరకు దోమలు ఆశించి ఉంటే ఎకరాకు ఒక లీటరు నీటికి 1.5గ్రాములు ఎసిఫేట్ కలిపి మొదళ్ల దగ్గర పడేలా పిచికారీ చేయాలి.
– చిరుపొట్టదశకు దాని వరి పైర్లలో సుడిదోమను గమనిస్తే ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను చల్లుకోవాలి.
– వరిదుబ్బులకు 100నుంచి 200వరకు సుడిదోమలు ఆశించినట్లయితే ఒక లీటరు నీటికి ఎసిఫేట్ 2 గ్రాములు, డైక్లోరోపాస్ ఒక మిల్లీలీటరు చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
– దోమ ఉధృతి తీవ్రంగా ఉంటే బుప్రోజిన్ ఒక లీటరు నీటికి 1.5మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
పాముపొడ తెగులు సోకిన వరిమొక్కలపై పొడలు, పొడలుగా మచ్చలు ఏర్పడతాయి. గట్లపై ఉండే గడ్డివలన ఈ తెగులు వరిపంటకు వ్యాపిస్తుంది. నత్రజనిని అధిక మోతాదులో వాడటం వలన కూడా ఈ తెగులు వరిపంటలో వ్యాప్తి చెందుతుంది.
– ముందుగా పొలంలో గట్లపై ఉన్న గడ్డిని కోసివేసి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
– తెగులు ఉధృతిని బట్టి ఒక లీటరు నీటికి ప్రోపికోనజోల్1మిల్లీలీటరు లేదా హెక్సాకోనజోల్ లేదా వాలిడా మైసిస్2 మిల్లీలీటర్ల చొప్పున పైరంతా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.
– వరిపైరు గింజ పోసుకునే దశలో తెగులు ఉధృతి పెరిగితే గింజలు పాలుపోసుకోకుండా నల్లగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టీ తక్షణమే తెగులును నివారించే చర్యలు చేపట్టాలి.
వరిపంటకు నల్లకంకి తెగులు సోకితే 30శాతం వరకు పంటదిగుబడిని నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా గింజ నాణ్యత కూడా బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు కంకినల్లి అనే పురుగు నుంచి వస్తుంది. ఇవి ఆకు మట్టలలోను, ఆకు మధ్య ఈనెలలోనూ గుంపులుగా నివసిస్తాయి. ఇవిచాలా సూక్ష్మంగా ఉంటాయి. రైతులు వీటిని వెంటనే అంత సులభంగా గుర్తించలేరు. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కంకినల్లులను స్పష్టంగా చూడగలం. ఇవి పంట పిలక దశలో ఆకు ఈనెలలో, మట్టలలో వృద్ధి చెందుతాయి. ఈ కంకినల్లి పంట పూతదశలో, పంట గింజ పాలుపోసుకునే దశలో గింజలను ఆశించి పంటను బాగా నష్టపరుస్తాయి. పంటను కంకినల్లి ఆశించినప్పుడు తొలి దశలోనే ఆకుల మధ్య ఈనెలపై, ఆకుల మట్టలపై, కాండం మీద ముదురు గోధుమనుంచి నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
– పంటను కంకినల్లి ఆశించకుండా ఉండాలంటే కలుపు మొక్కలు పొలంలోనూ, గట్లమీద లేకుండా చూసుకోవాలి.
– నత్రజని ఎరువులను తగిన మోతాదులో దఫాలు, దఫాలుగా వేసుకోవాలి.
– కంకినల్లిని కంటితో గమనించలేము. కాబట్టి ఆకుల మధ్య ఈనెల, ఆకు మట్టలపై, కాండంపై గోధుమ నలుపురంగు మచ్చలు గమనించినప్పుడే కంకినల్లి ఆశించినట్లుగా గుర్తింపు నివారణ చర్యలు చేపట్టాలి.
– పొలంలో కంకినల్లి ఆశించిన లక్షణాలు కనిపించగానే డైకోపాల్ 5మిల్లీలీటర్లు, ప్రొపినోపాస్ 2మిల్లీలీటర్లను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
– 15రోజుల వ్యవధిలో రెండుసార్లు మందును మార్చి పిచికారీ చేయాలి.
– కంకినల్లి బాగా ఆశించే ప్రాంతాల్లో పంటను కోసిన తరువాత వరి మొదళ్లు లేకుండా సమూలంగా నాశనం చేయాలి.
వరిపంటను ఆశించిన తెగుళ్లు, పురుగులను రైతులు మొదట్లోనే గుర్తించాలి. ఇప్పటికే పంటల వివిధ రకాల కూరగాయల పంటలతో పాటు ముఖ్యంగా వరిసాగుపై రైతులకు అవగాహన కల్పించాం. వరిపంటకు ఎలాంటి తెగుళ్లు సోకినా రైతులు నేరుగా డీలర్లను ఆశ్రయించకుండా వ్యవసాయాధికారులను ఆశ్రయించాలని, అనంతరం అధికారులు పంటలకు సోకిన తెగుళ్లును పరిశీలించిన తరువాత వారికి సూచనల మేరకు మందులను వేసుకుని పంటలను సాగుచేసుకోవాలి. వ్యసాయాధికారుల సూచనలు, సలహాలను రైతులు తప్పనిసరిగా పాటించాలి.
– శ్రవణ్ కుమార్, ఏఈవో ఇబ్రహీంపట్నం