హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections ) ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శాస్త్రీపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇక హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది. ఇది మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోకి ఉంది.
హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్‌లో ఉన్నది. ఇది సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నివాసం కుత్బుల్లాపూర్‌లో ఉన్నది. ఆయన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థికి ఓటువేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి తాండూరులో ఓటు ఉన్నది. ఆ ప్రాంతం చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. వీరంతా తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సి ఉంటుంది. కాగా, ప్రధాన పార్టీలకు చెందిన హైదరాబాద్ అభ్యర్థులంతా ఈ జాబితాలో ఉండటం విశేషం.