హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా, రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేశారు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోళ్లలో సమస్యేలేదని, అవన్నీ ప్రతిపక్షాలు, మీడియా సృష్టిస్తున్న వార్తలేనని చెప్పారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సదరు మంత్రి ధాన్యం కొనుగోళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన 20 రోజులు, నెల రోజులకు కూడా కొనుగోలు చేయడంలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఓ విలేకరి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సదరు మంత్రి స్పందిస్తూ… తెచ్చిన రెండు గంటల్లోనే కొనుగోలు చేస్తమని ఎక్కడైనా చెప్పినమా? అంటూ ఒక దశలో సహనం కోల్పోయి మాట్లాడారు.
హమాలీ సమస్యపై స్పందిస్తూ.. పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ హమాలీల సమస్య ఏర్పడిందని చెప్పారు. అయితే, ఎన్నికలు ఉన్నాయనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా…. లేబర్ సమస్య వస్తే ఏం చేస్తం? కొత్తగా లేబర్‌ను పుట్టిస్తమా? ఏందీ? అంటూ మరోసారి ఎదురు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, వడదెబ్బతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తుదిశ్వాస విడుస్తున్నారని, ఇప్పటికే సుమారు పది మంది రైతులు మరణించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు మంత్రి మాత్రం.. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులతో ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క రైతు కూడా మరణించలేదని చెప్పారు. ఇదిలాఉంటే ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం తగ్గింపుపైనా నాలుక మడతేశారు.
తొలుత 90లక్షల ట న్నులు సేకరిస్తామని చెప్పి, ఆ తరువాత 75లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం గా ఉన్నామని చెప్పడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అసలు తాము తమ లక్ష్యాన్ని ఎక్కడా చెప్పలేదని సదరు మంత్రి బుకాయించారు. మంచిని కాంగ్రె స్ సర్కార్ ఖాతాలో వేసుకుంటూ, సమస్యలను ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీపైకి నెట్టే ప్రయత్నం చేశారు. మక్కలు కొనడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. కేంద్రం కొంటున్న ధాన్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
బీఆర్ఎస్ సర్కార్ తో పోల్చితే తమ ప్రభుత్వం అధికంగా కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణలో మాదిరిగా ఇతర రాష్ర్టాల్లో యాసంగిలో ధాన్యం ఎక్కువగా సాగు కాదు. సహజంగానే ఇక్కడే ధాన్యం సేకరణ అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయిందంటూ ఒకవైపు సీఎం, మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలు గుప్పిస్తున్నారు. అలాంటప్పుడు కొనుగోలు కూడా ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది. ఇందులో సర్కార్ గొప్పతనమేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.