Telangana | హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆదాయ వృద్ధి నేల చూపులు చూస్తున్నది. పది నెలలుగా ప్రధాన రంగాలన్నింటిలో స్తబ్ధత నెలకొనడంతో.. ఖజానాకు రాబడి సైతం తగ్గుముఖం పట్టింది. ఇందుకు జీఎస్టీ వసూళ్ల లెక్కలే నిదర్శనం. ముఖ్యంగా నిరుటితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయ వృద్ధిలో తగ్గుదల నమోదైంది. సెప్టెంబర్లో అయితే ఆదాయ వృద్ధి దాదాపు శూన్యం. జీఎస్టీ వసూళ్లలో సైతం ఎదుగుదల నమోదు కాలేదు. 2023 సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లలో 33 శాతం వృద్ధి నమోదు కాగా.. ఈ సెప్టెంబర్లో కేవలం 0.78 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. 2022 సెప్టెంబర్లో రూ.3,915 కోట్ల ఆదాయం రాగా.. గత సంవత్సరం వసూళ్లు రూ.5,226 కోట్లకు పెరిగాయి. అంటే రూ.1311 కోట్ల పెరుగుదల నమోదయ్యింది. ఈ ఏడాది రూ.5,267 కోట్ల ఆదాయం వచ్చింది. పెరుగుదల కేవలం రూ.41 కోట్లు మాత్రమే. వీటిని కేవలం గణాంకాలుగా చూడొద్దని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబించే లెక్కలుగా చూడాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరు నెలలుగా ఆదాయ వృద్ధి తిరోగమనంలో ఉండటం మంచి సూచిక కాదని, ఇది ప్రభుత్వం పాలనా సమర్థతపై అనుమానాలు కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
ఆరు నెలలుగా ఇదే పరిస్థితి..
జీఎస్టీ వసూళ్ల వృద్ధి తిరోగమనం సెప్టెంబర్కే పరిమితం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ ఇదే పరిస్థితి. గతేడాదితో పోల్చితే గత ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో గణనీయమైన వ్యత్యాసం కనిపించింది. నిరుడు ఏప్రిల్ వసూళ్లలో 13 శాతం వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది 11 శాతానికే పరిమితం అయ్యింది. మే నెలలలోనూ ఇవే గణాంకాలు నమోదయ్యాయి. ఇక జూన్లో గతేడాది 20 శాతం వృద్ధి ఉంటే.. ఈ ఏడాది కేవలం 0.74 శాతమే వృద్ధి కనిపించింది. గత ఆరునెలల్లో ఇదే తక్కువ వృద్ధి. ఇక జూలైలో గతేడాది 7 శాతం వృద్ధి నమోదుకాగా.. ఈ ఏడాది 2 శాతానికి మించలేదు. ఆగస్టులోనూ గతేడాది 13 శాతం వృద్ధితో జోరు చూపించగా, ఈ ఏడాది 4 శాతంతో మందగించింది. సెప్టెంబర్ సంగతి సరేసరి.. ఈ ఏడాది రెండో అతితక్కువ వృద్ధి రేటు నమోదైంది.
అన్ని రంగాల్లో స్తబ్ధత
ఆర్థిక కోణంలో చూస్తే జీఎస్టీ వసూళ్లు వృద్ధి చెందాయంటే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో వృద్ధి నమోదవుతున్నదని అర్థం. కొనుగోళ్లు, అమ్మకాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, పెట్టుబడుల రాక వంటివన్నీ స వ్యంగా సాగుతున్నట్టని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలా జరగకుండా ఆర్థిక వృద్ధి మందగించినా, తిరోగమనం దిశగా సాగుతున్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత నెలకొంటున్నదన్న సంకేతాలు వచ్చినట్టేనని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మందగించిందని, కంపెనీలు పెట్టుబడులు ప్రకటిస్తున్నా అమల్లోకి రావడం లేదని, వ్యవసాయ రంగంలో గందరగోళం నెలకొన్నదని, రియల్ ఎస్టేట్ రంగం చతికిల పడిందనే ఆందోళన కనిపిస్తున్నదని, ఇవన్నీ కలగలిపి జీఎస్టీ వసూళ్ల వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ప్ర భుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని సూచిస్తున్నారు. లేదంటే వసూళ్లు మరింత పడిపోతాయని, మైనస్లలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నారు.
గతేడాదితో పోల్చితే వసూళ్ల పరిస్థితి ఇలా.. (రూ.కోట్లలో)