హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రైతులు ఎంతగానో ఎదురుచూసిన రైతుభరోసాపై శుక్రవారం నాటి క్యాబినెట్ సమావేశంలోనూ ఎలాంటి చర్చ జరగలేదు. వానకాలం పెట్టుబడిసాయంపై క్యాబినెట్లో నిర్ణయం ఉంటుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పట్లో రైతుభరోసా పంపిణీ లేనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వానకాలం పంట మరో 10-15 రోజుల్లో చేతికి రానున్నది. అయి నా పెట్టుబడిసాయంపై ఎలాంటి నిర్ణయం లేకపోవటంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతుబంధును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్.. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది.
ఇప్పటి వరకు రూ.2 లక్షల లోపు అరకొర రుణమాఫీ చేసిన సర్కారు.. రూ.2 లక్షలకుపై రుణం ఉన్న రైతులను గాలికి వదిలేసింది. వీరికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వటం లేదు. రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణంపై క్యాబినెట్లో విధివిధానాలు జారీచేస్తార న్న ప్రచారం జరిగింది. కానీ సమావేశం లో ఈ అంశంపైనా చర్చ జరగలేదు. దీం తో రూ.2 లక్షలకుపై రుణాలు ఉన్న రైతుల పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.
రూ.2 లక్షల రుణమాఫీలో భా గంగా 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీచేసింది. ఇంకా 19 లక్షల మంది రైతుల రు ణాలు రూ.13 వేల కోట్లు ఎప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.