హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హకు కలిగి ఉన్న వారిని గుర్తించి, ఫిల్టర్ చేసే సాంకేతిక వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ బీ చెన్నయ్య తెలిపారు. ఉద్దేశపూర్వకంగా డబుల్ ఓట్లు కలిగి ఉండటం మాత్రం చట్టరీత్యా నేరమని, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితాను పరిశీలించగా.. సుమారు 89.88 లక్షల మంది ఓటర్ల వివరాల్లో కొన్ని తారిక వ్యత్యాసాలు గుర్తించినట్టు ఆయన చెప్పారు. వీటిని సరిదిద్ది ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
‘సర్’ ప్రక్రియపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సీఈవో సహకారంతో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందదర్భంగా పీపీటీ ద్వారా ‘సర్’ ప్రక్రియపై సమగ్ర వివరణ అందించారు. ‘సర్’ ఉద్దేశం, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులు, ఇంటింటి సర్వే తదితర అంశాలపై విపులంగా వివరించారు. చెన్నయ్య మాట్లాడుతూ.. సమాజంలో నిరుపేదలు, నివాసం లేని వారికి సైతం ఓటు హకు కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు.
నివాసం లేని వారు బీఎల్వోను సంప్రదిస్తే ఎన్యుమరేషన్ ఫామ్ అందిస్తారని, దాని ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అనాథ యువత సైతం ఓటు హకుకు దూరం కాకుండా, గార్డియన్ (సంరక్షకుడు) పేరుతో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌ల పంపిణీ, జూలై 31న ఓటర్ల డ్రాఫ్ట్ (ప్రాథమిక) జాబితా విడుదల, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ, పరిష్కారాలు ఉంటాయని వివరించారు. అక్టోబర్ 1న తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.
బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో) పరిధిలో సగటున 1,200 ఓటర్లు ఉంటారని చెన్నయ్య చెప్పారు. ఎన్యుమరేటర్ ఫామ్‌ను నాలుగు విభాగాలుగా నింపాల్సి ఉంటుందని, రెండు ఫామ్‌ల మీద సంతకం చేసి ఒకటి రసీదుగా ఓటరు తీసుకొని, మరొకటి బీఎల్వోకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్యుమరేటర్ ఫామ్‌లో అన్ని వివరాలు సక్రమంగా ఉంటే జూలై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు. లివింగ్ రిలేషన్ ఉన్నవారి పిల్లలకు అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండితే తమ తల్లి లేదా తండ్రి వివరాలతో ఎన్రోల్ చేసుకోవచ్చని తెలిపారు.
పోలింగ్స్టేషన్లవారీగా ఓటర్ల జాబితాలు ప్రచురిస్తామని, ఓటరు జాబితాలో పేరు ఉన్నదా? లేదా? అనే విషయాన్ని http://ceotelangana.nic.in లో చూసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం ఓటర్లు టోల్‌ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించవచ్చని, లేదా http://voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా, ఈసీఐనెట్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సీఈవో ఆఫీస్ ఐటీ మేనేజర్ డీ చిరంజీవి, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర్రావు, వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులు పాల్గొన్నారు.