హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : మాతృభాషల్లో నీట్ పరీక్షకు విద్యార్థుల నుంచి స్పందన కానరావడం లేదు. ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశమిచ్చినా.. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. అత్యధికులు ఇంగ్లిష్‌లోనే నీట్ పరీక్ష రాస్తున్నారు. 2019 నుంచి నీట్‌ను ఇంగ్లిష్, హిందీతోపాటు అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి దాదాపు అన్నిభాషల్లో దరఖాస్తులు తగ్గాయి. మొత్తం 22.09లక్షల మంది దరఖాస్తు చేస్తే, అత్యధికంగా 18.22లక్షల మంది ఇంగ్లిష్‌లో నీట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగులో నీట్ రాసేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడంలేదు. 2019 నుంచి ఇదే పరిస్థితి నెలకొంటున్నది. 2019 నుంచి 2025 వరకు దరఖాస్తులు ఎప్పుడు రెండువేలు దాటలేదు. 2019లో 700 మంది దరఖాస్తు చేసుకోగా, 2020లో అత్యధికంగా 1,624 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఏడేండ్లల్లో ఇదే అత్యధికం. ఈ సారి ఏకంగా 907కు పడిపోయాయి. జాతీయ భాష అయిన హిందీలో నీట్ రాసేందుకు నిరుడు 3.57లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, ఈ సారి ఆ సంఖ్య 3.28లక్షలకు తగ్గింది. బెంగాలీలో నిరుడు 48వేల మంది దరఖాస్తు చేస్తే ఈ సారి 38 వేలు మాత్రమే దరఖాస్తు చేశారు. గుజరాతీలో నిరుడు 58 వేల మంది ఉండగా.. ఈ సారి 53వేల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. తమిళ్లో నిరుడు 36వేల మంది రాస్తే, ఈ సారి 26వేలకు పడిపోయింది.
మళయాలంలో 2019, 2020లో ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. ఈ సారి కేవలం 170 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. మరాఠీలో రాసేందుకు 2019లో ఏకంగా 31,239 మంది దరఖాస్తు చేశారు. ఇప్పుడు వీరి సంఖ్య కేవలం 927 మంది మాత్రమే. 2019లో ఒడియాలో 31,490 మంది దరఖాస్తు చేస్తే.. ఇప్పుడు 812కు పరిమితమయ్యింది. పంజాబీ భాషలో 2019, 2020లో ఒక్కరంటే ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. నిరుడు 214 మంది దరఖాస్తు చేస్తే, ఈ సారి 170కి పడిపోయింది.