మిస్ ఇంగ్లండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడైనఓ ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీసీ ఫుటేజీని బయటపెట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. వినూత్న పథకాలతో తెలంగాణను కేసీఆర్ ప్రపంచపటంలో నిలిపితే.. రేవంత్ సర్కారు మాత్రం అందాల పోటీల పేరిట తలవంపులు తెచ్చింది.
రాష్ట్రం అప్పుల కుప్పయిందని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మరి అందాల పోటీలకు పైసలెక్కడి నుంచితెచ్చిండ్రు? పథకాలకు పైసల్లేవని చెప్తున్న ఆయన.. తన భూములకు ఆరు లేన్ల రోడ్ల కోసం బడాబడా కాంట్రాక్టర్లకు రూ.12000 కోట్లు ఎట్ల ఇచ్చిండ్రు? యంగ్ ఇండియా స్కూళ్లకు మొదట రూ.80 కోట్లన్నరు.
తర్వాత రూ. 130 కోట్లన్నరు. ఇప్పుడు రూ.200 కోట్లు ఎట్ల ఖర్చుపెడుతున్నరు.?
కేసీఆర్ అంటే అభివృద్ధి.. రేవంత్‌రెడ్డి అంటే అబద్ధాలు. ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలను.. అన్నదాతకు రుణమాఫీని ఎగ్గొట్టి, రైతుబంధు ఎత్తేసి, రైతు బీమాను అటకెక్కించి ముఖ్యమంత్రి మోసం చేసిండు. కేసీఆర్ సర్కారు చేసిన మంచి పనులపై ఏడాదిన్నర పాలనలో కమిషన్లు.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీలేదు.
-మాజీమంత్రి, హరీశ్
ఈ రోజు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనేందుకు కారణం కేసీఆర్ కాదా? కేసీఆర్ లేకుంటే, గులాబీ జెండా పుట్టి ఉండకుంటే స్వరాష్ట్రం సిద్ధించేదా? మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. సాధించిన రాష్ర్టాన్ని సుసంపన్నం చేసింది కేసీఆరే.. ధాన్యపు రాశులనే కాదు.. ఏటా 10 వేల మంది డాక్టర్లను సైతం ఉత్పత్తి చేసిన ఘనత ఆయనకే దక్కింది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): ‘వచ్చే ఎన్నికల్లోగానీ, భవిష్యత్తులోగానీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చాటుతాం’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. ‘కొందరు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ఆందోళనకు గురి కావద్దు’ అని పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు సూచించారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, కేసీఆర్ పేరు ఉంటదని స్పష్టం చేశారు. ‘తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదు. 8 ఎంపీ సీట్లలో గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే బడ్జెట్లో సాధించింది గుండు సున్నా’ అని నిప్పులు చెరిగారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా అడిగితే డ్రామాలు చేసిన కిషన్‌రెడ్డి మాటలను తెలంగాణ ప్రజానీకం నమ్మబోదని పేర్కొన్నారు. ఆనాడు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ ఆర్భాటం చేసిన బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా వెనక్కిపోయిందని ఆరోపించారు.
సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరైన హరీశ్‌రావు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ రాష్ర్టావతరణ ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ పదాన్ని నిషేధించిన రోజుల్లో, పదవుల కోసమే తెలంగాణ గురించి మాట్లాడతారనే అపవాదు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధనను భుజానికెత్తున్నారని గుర్తుచేశారు. నెలల తరబడి మేధోమథనం చేసి ఉద్యమానికి అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను త్యజించిన చరిత్ర ఆయన సొంతమని అన్నారు. రాజకీయ శూన్యతలేని రోజుల్లో రాజకీయ ఉద్ధ్దండులు పాలక, ప్రతిపక్షాలుగా ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు అంకురార్పణ చేశారని చెప్పారు. 25 ఏండ్ల క్రితం తెలంగాణ.. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, వలసలు, ఆకలి చావులకు నిలయంగా ఉండేదని గుర్తుచేశారు.
‘ఆనాడు ఉసిల్లలెక్క పార్టీలు పుట్టినయ్.. అంతరించినయ్. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి నుంచి 11 మంది ఎంపీలు గెలిచారు. కానీ అప్పటి ఇందిరా సర్కారు తెలంగాణ ఇవ్వకుండా కాలరాసింది’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఉద్యమాన్ని ప్రారంభించిననాడు కేసీఆర్ ఆర్థికంగా బలవంతుడు కాదని, గుండె ధైర్యం, రాజీలేని పోరాటమే ఆయన నైజమని పేర్కొన్నారు. అంబేద్కర్ పంథాలో, రాజకీయ మార్గంలోనే తెలంగాణ సాధన సాధ్యమని నమ్మి ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా 33 పార్టీలను ఏకం చేశారని కొనియాడారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, సీమాంధ్ర పాలకుల ఎత్తుగడలను చిత్తుచేసి, సోనియాగాంధీతో ప్రకటన చేయించి గమ్యాన్ని ముద్దాడారని చెప్పారు. ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనేందుకు కారణం కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుంటే, గులాబీ జెండా పుట్టకుంటే స్వరాష్ట్రం సిద్ధించేదా అని ప్రశ్నించారు. ధాన్యపు రాశులనే కాదు ఏటా 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేశారని స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపారని, ఇప్పుడు ప్రతిపక్షపాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నామని వివరించారు. హైడ్రా, మూసీ బాధితులకు అండగా నిలిచామని, ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ మాత్రమేని ఉద్ఘాటించారు.
ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి రైఫిల్రెడ్డిగా తెలంగాణ చరిత్రలో నీచమైన వ్యక్తిగా రేవంత్‌రెడ్డి నిలిచి పోయారని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఆయన ఏనాడు జై తెలంగాణ అని నినదించలేదని, అమరవీరులకు నివాళులర్పించలేదని, చిన్న పదవిని కూడా త్యాగం చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కూడా ఏమీలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే యెండల లక్ష్మీ నారాయణను ముందుపెట్టి వెన్నుచూపిన ఘనుడు కిషన్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే అభివృద్ధి. రేవంత్‌రెడ్డి అంటే అబద్ధాలని ఫైరయ్యారు. ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలిస్తామని, అన్నదాతకు రుణమాఫీ ఎగ్గొట్టి, రైతుబంధు ఎత్తేసి, రైతుబీమాను అటకెక్కించి మోసం చేసిన నీచుడు రేవంత్‌రెడ్డి అని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ‘ఏడాదిన్నర పాలనలో కేసీఆర్ సర్కారు మంచి పనులపై కమీషన్లు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం’ తప్ప సాధించిందేమీలేదని నిప్పులు చెరిగారు. ‘మహిళలకు 21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని ఆవిర్భావ దినోత్సవాల్లో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇందుకు సంబంధించిన జీవో చూపిస్తే వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే ఆయన నా సవాల్‌ను స్వీకరించాలి’ అని డిమాండ్ చేశారు. పదే పదే 60 వేల ఉద్యోగాలిచ్చినట్లు అసత్యాలు చెబుతున్నారని, ఇచ్చింది 11 వేలేనని స్పష్టం చేశారు.
‘ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఉద్ధరించిందేంటి? కనీసం ఒక్క ప్రాజెక్టు కట్టిన్రా? ఎకరానికైనా నీరిచ్చిన్రా? చెక్ డ్యాం నిర్మించిన్రా? ఒక చెరువైనా తవ్విన్రా?’ అని హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చి వెలుగులు నింపారన్నాని గుర్తుచేశారు. అనేక ప్రాజెక్టులు కట్టారని, రైతుబంధు ఇచ్చి, రైతుబీమా ఇచ్చి రైతులకు అండగా నిలిచారని స్పష్టం చేశారు. రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని రూ. 16 వేల కోట్లు కూడా చేయలేదని, మిగిలిన డబ్బు ఎక్కడికిపోయిందని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ధాన్యం రాశుల మీద రైతులు గుండెపగిలి చనిపోతుంటే సీఎం రేవంత్ మాత్రం అందాల పోటీల్లో మునిగితేలారని ఎద్దేవా చేశారు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవడం దేవుడెరుగు కనీసం పరామర్శించలేదని విమర్శించారు.
అందాల పోటీల పేరిట అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఒలిపింక్స్ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉన్నదని హరీశ్ ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం చేతగాని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా గొప్పలకు పోతున్నారని చురకలంటించారు. మాటలు కట్టిపెట్టి పాలనపై దష్టి పెట్టాలని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, దివాలా తీసిందని, ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. దివానాగాళ్లే తెలంగాణను దివాలా తీసిందంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తన గోతిని తానే తవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అందాల పోటీలకు పైసలెక్కడి నుంచి తెచ్చారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘పథకాలకు పైసల్లేవని చెప్తున్న నువ్వు. నీ భూములకు ఆరులేన్ల రోడ్లకు, బడా కాంట్రాక్టర్లకు రూ. 12,000 కోట్లు ఎట్ల ఇచ్చినవ్. యంగ్ ఇండియా స్కూళ్లకు మొదట రూ. 80 కోట్లని, తర్వాత రూ. 130 కోట్లని, ఇప్పుడు రూ. 200 కోట్లు ఎట్ల వెచ్చిస్తవ్’ అని నిలదీశారు. ఈ స్కూళ్ల నిర్మాణం పేరిట ఐదారు వేల కోట్ల స్కాంకు తెరలేపారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడంతో నిరుపేద విద్యార్థులు ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం మాత్రం సోకుల కోసం ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నదని దుయ్యబట్టారు.
సర్కారు కనుసన్నల్లో కొందరు పోలీసు అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని హరీశ్ మండిపడ్డా రు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న గౌతమ్, గతంలో రేవతిని తీవ్ర ఇబ్బందిపెట్టారని విమర్శించారు. సర్పంచ్ల నుంచి జడ్పీ చైర్మన్ల దాకా అందరినీ ఏదోరకంగా బెదిరిస్తున్నా రని మండిపడ్డారు. రాత్రిరాత్రే అరెస్ట్‌లకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అతిగా వ్యవహరించే పోలీసులు, అధికారులెవరో తమకు తెలుసని, వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటామని హెచ్చరించారు.
సీఎం రేవంత్ సన్నిహితుడైన ఓ ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మిస్ ఇంగ్లండ్‌తో అనుచితంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయని హరీశ్ తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టి, బాధ్యులపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వినూత్న పథకాలతో తెలంగాణను ప్రపంచపటంలో నిలిపితే, సీఎం రేవంత్ సర్కారు మాత్రం అందాల పోటీల పేరిట తలవంపులు తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న ఆయన అందాల భామలకు చూపించేందుకు కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియట్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనం, యాదాద్రి ఆలయమే దిక్కయ్యాయని ఎద్దేవా చేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు కాదు నీ తాత జేజేమ్మ వచ్చినా కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేరు. చరిత్రలో నిలిచి పోయే ఘట్టాలు చెరిపివేస్తే చెరిగిపోవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని చురకలంటించారు. అంబేద్కర్ పేరుతో కట్టినందునే సచివాలయానికి వెళ్లడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర అవతరణోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గులాబీ శ్రేణులు ‘జై తెలంగాణ..జయహో తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. కళాకారుడు సందీప్ ఆలపిచించిన జయహో తెలంగాణ గీతం ఆకట్టుకున్నది. కళాకారులు తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శనలు ఇచ్చారు.
కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణకు చేసిందేమీలేదని హరీశ్‌రావు విమర్శించారు.11 ఏండ్లలో ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీలోని పోలవరానికి జాతీయ హోదాతోపాటు గోదావరి బనకచర్ల అక్రమ ప్రాజెక్టుకు నిధులిచ్చి తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపంగా మారనున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో మన రాష్ట్రం తెర్లుకావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్టా జలాలను ఏపీ తరలించుకుపోతున్నా, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా సీఎం రేవంత్ చోద్యం చూస్తున్నారని దుయ్య బట్టారు. తన గురువుకు దక్షిణ కింద గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పజెప్పుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసేందుకు, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.