Rythu Bima | హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటలబీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటలబీమా కష్టమేననే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జరుగుతున్నది. ఎప్పుడు అమలు చేస్తారనే అంశంపై కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. అసలు ఈ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పంటలకు పంటలబీమా అమలుచేస్తామని, నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. పార్టీ మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సీజన్లు పూర్తయి నాలుగో సీజన్ వస్తున్నా పంటలబీమా అమలుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ప్రకటనలే తప్ప పని లేదు
పంటలబీమా అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ప్రకటనలు జారీచేశారు. వానకాలం సీజన్ నుంచి అని ఒకసారి, యాసంగి నుంచి అని మరోసారి చెప్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు పూర్తిచేసినట్టు తెలిపారు. దీంతోపాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. తద్వారా రైతులకు ఉచితంగానే పంటలబీమా అమలుచేస్తామని గొప్పగా చెప్పారు. అన్ని పంటలకు బీమా అమలు చేస్తామని, ఏ చిన్న సమస్య వచ్చి పంటలు పాడైనా.. వారికి పూర్తి పరిహారం అందిస్తామని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ ఫసల్‌బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది. దీంతోపాటు పలు బీమా కంపెనీలతో చర్చలు జరిపింది. గత యాసంగి సీజన్లో అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడటం లేదని తెలిసింది.
నిధుల కొరతే కారణమా?
ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకపోవడానికి నిధుల కొరతే ప్రధాన కారణమని తెలిసింది. పంటలబీమా అమలు కోసం ఏటా సుమారు రూ.3వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నిధుల కొరత ఉన్నదన్న సాకుతో ఈ పథకాన్ని పక్కనపెట్టినట్టు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం రైతుభరోసా పంపిణీ పూర్తిచేసేందుకే నానా తంటాలు పడుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో పంటలబీమా అమలు చేసే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. ‘ముందు రైతుభరోసా పంపిణీ చేయనివ్వండి ఆ తర్వాత పంటల బీమా పథకం గురించి ఆలోచిద్దాం’ అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగి ఒకరు నిట్టూర్చడం గమనార్హం.
రైతులకు దక్కని పరిహారం
రాష్ట్రంలో పంటలబీమా అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కరువు ఛాయలతో పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారు. గత వానకాలంలో భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. పంటలబీమా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటికే కరువు ఛాయలు మొదలయ్యాయి. పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంటలబీమా ఉంటే.. రైతులకు ఆ మేరకు పరిహారం దక్కి ఆర్థికంగా కొంత ఊరట లభించేది.