ఎదులాపురం, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ పార్టీలో దళితులకు స్థానం లేదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దర్శనాల సంటెన్న అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ‘నేను ఓ దళిత బిడ్డను. 40 ఏండ్లుగా పార్టీలో పనిచేస్తున్న. నాకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వకపోతే కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంట’ అని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక పార్టీ సీనియర్లకు నామినేట్ పదవులు ఇస్తామని పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ విషయంలో మంత్రులు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ కాళ్లుపట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్ష రుణం తీసుకొని పార్టీ కోసం తిరిగానని, దళిత బిడ్డనైన తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో రెడ్డిలకు, బీసీలకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి స్పందించి మార్కెట్ కమిటీ పదవి ఇప్పించాలని, లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.