హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): క్రిస్టియన్ల శ్మశానవాటికలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థలాల్లేవని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఊరికి దూరంగా శ్మశానవాటికలు ఏర్పాటు చేసుకోవాలని, మృతదేహాలను తరలించుకునేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేసుకోవాలని క్రిస్టియన్లకు సూచించారు.
విద్వేష ప్రసంగాలపై త్వరలోనే శాసనసభలో చట్టం తెస్తామని వెల్లడించారు. త్వరలోనే బడ్జెట్ సమావేశాల్లో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమాన హక్కు ఇస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమం వారి హక్కు అని చెప్పారు. ఏసుప్రభువు జన్మ ఈ లోకానికి శాంతి, ప్రేమను అందించిందని తెలిపారు. క్రిస్టియన్లు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.