హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనిపించడం లేనట్టున్నది. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరడమే గాక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలెన్నో జరుగుతున్నా అలాంటివేమీ లేవంటూ అబద్ధాలు చెప్పడం ఆయనకే చెల్లింది. పురుగుల అన్నం తినలేకపోతున్నం.. పెచ్చులూడిన భవనాల్లో భయంభయంగా ఉంటున్నం.. అంటూ మొన్నటికిమొన్న నేరుగా పోలీస్‌స్టేషన్‌కే వెళ్లి విద్యార్థులు సీఐకి తమ ఆవేదన చెప్పుకొని ఆందోళన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ఆయన మాత్రం రాష్ట్రంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలే జరగలేదని తేల్చేశారు. గురుకులాలన్నీ ఏ సమస్యల్లేకుండా బాగున్నాయని చెప్పుకొచ్చారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంట్లో నిర్వహించిన ప్రెస్మీట్లో గురుకులాలపై విలేకరులు ప్రశ్నించారు. గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడుగడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్టుంది.
ప్రశ్న అడిగిన విలేకరిపై రుసరుసలాడారు. ‘ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని అనుకోవడం అది నీ అమాయకత్వం. లేనిది ఊహించుకొని కాయించుకొని ఎక్కడేం జరిగిందనే లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగొద్దు. అలాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా, ఏదైనా అలాంటి ఘనటలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. ఈ విధంగా అసలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం లేదనే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులను స్వీకరించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ ఇలా అసలు తప్పులు జరగడం లేదంటూ దబాయించేలా మాట్లాడడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎవరిని అడిగినా చెబుతారు. గురుకులాల టీచర్లే స్వయంగా విద్యార్థులను దవాఖానలకు తీసుళ్తున్నారు. అయినా సీఎం మాత్రం అవన్నీ అబద్ధాలే అనేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.