హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ‘కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం ముసుగులో వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి తెరలేపారు. ఇందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నది. 48 గంటల్లో అన్ని వివరాలు బయటపెడతాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగెటివ్ పాలసీలతో నెగెటివ్ పాలన సాగిస్తున్నదని, అందుకే జీడీపీ వృద్ధి రేటు తిరోగమనంలో పయనిస్తున్నదని నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే.. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్
కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న వారిని సర్కారు అపహాస్యం చేస్తున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు.
వారి పోరాటాన్ని తక్కువచేసి చూపిస్తు న్నదని ఆక్షేపించారు. అక్కడి భూముల్లో జింకలు, వన్యప్రాణులు లేవని, విద్యార్థులు ఏఐతో కృత్రిమంగా సృష్టించారని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగిస్తూ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘సర్కారు చెప్తున్నదే నిజమైతే, అక్కడి జూపార్క్ అధికారులు హెచ్‌సీయూ ప్రాంతంలోని జూపార్క్‌కు రెండేండ్ల క్రితం తరలించామని ప్రభుత్వానికి ఏవిధంగా నివేదించారు? వారు చెప్పింది అబద్ధమా? విద్యార్థులు చూపుతున్నవి అవాస్తవాలా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా పర్యావరణవేత్తల, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని భూముల అమ్మకం ఆలోచనను విరమించుకుంటే మంచిదని హితవు పలికారు. నిజంగా పరిశ్రమల ఏర్పాటుపై నిబద్ధత ఉంటే ఫార్మాసిటీలోని 14 వేల ఎకరాల్లో అనుమతించాలని డిమాండ్ చేశారు.
మూగజీవులను వధిస్తే కేసులేవీ?
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు సర్కారుకు చెందినవే అయితే, రాత్రికి రాత్రి వందలాది బుల్డోజర్లను పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ నిలదీశారు. విద్యార్థులతో, పర్యావరణవేత్తలతో చర్చలు జరపకుండా, కోర్టును ప్రత్యేక గడువు కోరి తొందరపాటుతో ఎందుకు ముందుకెళ్లారని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూపోరాటంలో ఏఐతో ఫేక్ వీడియోలు సృష్టించారని చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు.. సర్కారు విధ్వంసానికి చెదిరి ఇండ్లలోకి వచ్చిన జింకలు కనిపించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. ఏఐతో ఫేక్ వీడియోల పేరిట అమాయక విద్యార్థులపై కేసులు పెడుతున్న ప్రభుత్వం.. మూగజీవుల వధకు కారణమైన వారిని ఎందుకు వదిలిపెడుతున్నదని ప్రశ్నించారు. ఈ విషయంలో జాతీయస్థాయిలో చాలామంది ప్రముఖులతోపాటు ధ్రువ్‌రాఠీ వంటి వారు కూడా ప్రభుత్వ దుశ్చర్యలను తప్పుబట్టారని గుర్తుచేశారు. ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారంటూ పార్లమెంట్లో కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్టు, ఆయనతో ఏకీభవిస్తున్నట్టు కేటీఆర్ స్పష్టంచేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా వందలాది చెట్లను నేలమట్టం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. విద్యార్థులపై కేసులు ఉపసంహరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు.
చోద్యం చూస్తున్న కేంద్రం
హెచ్‌సీయూలో ఇంత రగడ జరుగుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ఇక్కడి పరిస్థితులను చూసి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ దుర్మార్గంపై మొట్టికాయలు వేసిందని, చీఫ్ సెక్రటరీపై కేసు పెట్టి జైల్లో పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేశారు. ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకులు తలోమాట మాట్లాడుతూ పలుచన అవుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సన్నిహితుడు, ఎంపీ మల్లు రవి యూనివర్సిటీని తరలిస్తామని చెప్తుంటే, పీసీసీ చీఫ్ మాత్రం అదేమీలేదంటున్నారని, అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరేం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కవద్దనే దురుద్దేశంతో భూములను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. గతంలో తాను సందర్శించిన హెచ్‌సీయూలో ఇంతటి వివాదం జరుగుతుంటే రాహుల్‌గాంధీ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీని సందర్శించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ వైఫల్యం.. మీనాక్షి జోక్యం
‘ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. అందుకే ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇక్కడకు వచ్చి ఏకంగా సచివాలయంలోనే మంత్రులతో సమీక్షించారు. విద్యార్థులతో చర్చించారు’ అని కేటీఆర్ వివరించారు. ‘ఢిల్లీ పార్టీల చేతుల్లో పాలనా పగ్గాలుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు క్యాబినెట్ విస్తరణ చేసుకొనే పరిస్థితి కూడా లేదు. రెండు పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉన్నది. ఒకరు బ్యాగులు మోస్తే, ఇంకొకరు చెప్పులు మోస్తున్నారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తే, రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి తెచ్చిందిలేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైవర్షన్ డ్రామాల్లో ఆరితేరిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కే విమానం, దిగే విమానం చందంగా పదే పదే ఢిల్లీకి వెళ్తూ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు.
ఒక్కరోజే మోదీ హ్యాట్రిక్
ఎల్పీజీ ధరల పెంపు, పెట్రోల్‌పై సుంకాల పెంపు, స్టాక్ మార్కెట్లో రూ.16 లక్షల కోట్లు ఆవిరి.. ఇలా ప్రధాని మోదీ ఒక్కరోజే హ్యాట్రిక్ ఘనత సాధించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గుతుంటే, మన దేశంలో మాత్రం పెట్రోలియం ధరలు తగ్గించకపోవడంలోని ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదని మండిపడ్డారు. ఎైక్సెజ్ సుంకం పెంపుతో రాష్ర్టానికి వచ్చే రాబడి ఏమీ ఉండదని, మొత్తం కేంద్రం ఖాతాల్లోకి పోతుందని వివరించారు. ఎల్పీజీ ధర పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంబద్ధ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సొమ్ము రూ.16 లక్షల కోట్లు ఆవిరైంది. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సామాన్యుల సంపద కూడా ఆవిరి అవుతుంటే కేంద్రం మాట్లాడటంలేదు. ట్రంప్ సుంకాలు, నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఫార్మా, ఐటీ సెక్టార్లపై గణనీయంగా పడుతుంది. ఇంత జరిగినా ప్రధాని మోదీ, వాణిజ్య మంత్రి పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బాధితులకు అండగా బీఆర్ఎస్
కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నదని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘లగచర్లలో తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్న గిరిజన రైతులు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. మొన్న హెచ్‌సీయూ విద్యార్థులు మద్దతు కోసం మా వద్దకు వచ్చారు. అంతేగానీ, బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా ఎవరినీ రెచ్చగొట్టలేదు’ అని స్పష్టంచేశారు. భవిష్యత్‌లోనూ ప్రజా సమస్యలపై బరాబార్ గిరిగిసి కొట్లాడుతామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ పొత్తుల సద్ది రేవంత్
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మద్దతుతో పాలన సాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పొత్తుల సద్ది మాదిరిగా ఆయనకు రెండు పార్టీలు అండగా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. ఆయనకు ఏ కష్టం వచ్చినా ఢిల్లీలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో బండి సంజయ్ అండగా ఉంటున్నారని విమర్శించారు. గతంలో అమృత్ స్కాంపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఉదహరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేసి ఆరు నెలలైనా కేసులు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ కూడా కేంద్రంతో అంటకాగుతున్నదని, అందుకే ఎల్పీజీ ధరలు పెంచినా రాష్ట్రంలోని కాంగ్రెస్ పెద్దలు మాటమాత్రంగానైనా తప్పుబట్టడంలేదని దుయ్యబట్టారు. వీరి అనైతిక పొత్తును గమనించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు శ్రీరామరక్ష ఇంటిపార్టీ అయిన బీఆర్ఎస్ అనే విషయం మరిచిపోవద్దని విజ్ఞప్తిచేశారు.
డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ది స్పష్టమైన వైఖరి
‘డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ స్పష్టమైన వైఖరితో ఉన్నది. తమిళనాడు సీఎం స్టాలిన్ కంటే ముందునుంచే దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నదనే విషయాన్ని చెప్తూ వస్తున్నాం’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పారు. దీనిపై డీఎంకేతోపాటు కలిసివచ్చే పార్టీలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. సన్నబియ్యం పథకాన్ని తమ ఘనతగా కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ పథకానికి కేసీఆర్ ఏనాడో శ్రీకారం చుట్టారని, హాస్టళ్లలో సన్నబియ్యంతో ఆహారం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాల్‌పై తోకముడించిందని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ మాఫీ కాలేదని, సీఎం స్వగ్రామంతోపాటు ఏ ఊర్లోనైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా అసెంబ్లీ సాక్షిగా పారిపోయిందని ఎద్దేవా చేశారు.
రేవంత్ ద్వేషం.. రైతులకు శాపం..
సీఎం రేవంత్ ద్వేషపూరిత వైఖరి రాష్ట్ర రైతులకు శాపంగా మారుతున్నదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌పై ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్‌కు మరమ్మతు చేయించకపోవడంతో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. భూకంపంతోపాటు 28 లక్షల నీటి ప్రవాహానికి తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో తెలంగాణ సాగు ప్రాజెక్టులపై కేంద్రానికి పిటిషన్లు సమర్పించి అభ్యంతరం చెప్పిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌దాస్‌ను రేవంత్‌రెడ్డి నీటి పారుదల సలహాదారుగా పెట్టుకోవడంలోని అంతర్యమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పారని పెట్టుకున్నారా? అని నిలదీశారు. సర్కారు వైఖరితో గోదావరి, కృష్ణా బేసిన్లలో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో నెగెటివ్ గ్రోత్ రేటు
రేవంత్ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలు, నెగెటివ్ విధానాలతో రాష్ట్రంలో నెగెటివ్ గ్రోత్ రేటు నమోదవుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘16 నెలల కాలంలో వాహనాల కొనుగొలు తగ్గింది. రియల్ఎస్టేట్ పడిపోయింది. ఎయిర్‌పోర్ట్‌కు మెట్రోరైలు రద్దయింది. ఫార్మాసిటీ వెనక్కిపోయింది. హైడ్రా, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట సాగించిన కూల్చివేతలతో రాష్ట్రం ఆగమైపోయింది’ అని మండిపడ్డారు. ‘సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి నుంచి మొదలుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా అందరిపైనా నెగెటివ్ ధోరణే. లగచర్ల భూములివ్వబోమన్న గిరిజనులు, భూములు అమ్మవద్దన్న హెచ్‌సీయూ విద్యార్థుల దాకా అందరినీ బద్నాం చేసుడే. ఇంతకుమించి 16 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిందేమీ లేదు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కేసులకు భయపడం
‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నది. ఇది అయ్యే పనికాదు. నాపై ఎన్ని వందల కేసులు పెట్టారో తెలియదు. అయినా భయపడేది లేదు. పోరాటాన్ని ఆపేది లేదు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. కాం గ్రెస్ ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను నియమించుకొని ప్రతిపక్షాలపై దాడికి ఉసిగొల్పిందని ఆరోపించారు. టూల్కిట్లా అందరూ ఒకే తరహాలో పదే పదే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. వారికి జీతాలు ఎవరిస్తున్నారో అర్థంకావడంలేదని, రాష్ట్ర ఖజనా నుంచి మాత్రం చెల్లించవద్దని హెచ్చరించారు. కృష్ణా జలాల వాడకంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
బీఆర్ఎస్ హయాంలో 36% జలాలను వినియోగించుకున్నం.. కానీ, ఈ సీజన్లో విరివిగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారినా తెలంగాణ మాత్రం 24% జలాలనే వినియోగించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. -కేటీఆర్
హెచ్‌సీయూలో ఇంత రగడ జరుగుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నది. గతంలో తాను సందర్శించిన హెచ్‌సీయూలో ఇంతటి వివాదం జరుగుతుంటే రాహుల్‌గాంధీ ఎందుకు పట్టించుకోవడంలేదు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీని సందర్శించాలి
-కేటీఆర్
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. అందుకే ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో పాలనా పగ్గాలుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు క్యాబినెట్ విస్తరణ చేసుకొనే పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్, బీజేపీ..రెండు పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉన్నది. ఒకరు బ్యాగులు మోస్తే, ఇంకొకరు చెప్పులు మోస్తున్నారు. –బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్