Govt Hospitals | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉన్నదని ఫార్మాసిస్టులు టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కడేకు స్పష్టంచేశారు. దవాఖానల్లో మందుల కొరతపై ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం ఆయన ఫార్మసిస్టులను హైదరాబాద్కు పిలిపించుకొని చర్చించారు. ఈ సందర్భంగా దవాఖానల్లో ఏయే మందు లు, సర్జికల్స్ లేవో వారు వివరించారు. ఈ సందర్భంగా ఎండీ స్పందిస్తూ.. కొన్ని మందుల ఆర్డర్ పెండింగ్లో, మరికొన్ని సరఫరా దశలో ఉన్నాయని, ఇంకొన్ని నాణ్యత పరీక్షలకు పంపామని వివరించినట్టు తెలిసింది. అత్యవసర మందులు, సర్జికల్స్ జాబితాను రూపొందించామని, వీటిని అక్టోబర్ 15 నాటికి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎండీ వారితో చెప్పినట్టు సమాచారం.
నివేదిక ఎందుకిచ్చారని ఆగ్రహం..
ఇటీవల కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ దవాఖానను సందర్శించగా అధికారులు మందుల కొరతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. అందుబాటులోలేని మందుల జాబితా ఇవ్వాలని సూచించా రు. ఫార్మసిస్టు జాబితాను కలెక్టర్కు అం దించగా, టీజీఎంఎస్ఐడీసీ ఉన్నతాధికారులు సదరు ఫార్మసిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు ఈ అంశంపై డీఎంఈ ప్రత్యేక విచారణ చేపట్టారు. సోమవారం ఓ అధికారిని కామారెడ్డి జిల్లా దవాఖానకు పంపి విచారణ జరిపించారు.