Akeru Vagu | మరిపెడ, మార్చి 9: నోటి కాడికొచ్చిన పంట పొలాలు కండముందే ఎండుతుంటే రైతన్న పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య నెలకొన్నది. ఎస్సారెస్పీ నీటిని సకాలంలో విడుదల చేయకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని పురుషోత్తమాయగూడెం, బీచురాజ్పల్లి, తండా ధర్మారం, బాల్ని ధర్మారం, ఉల్లేపల్లి, భూక్యా తండా రైతులు అవస్థలు పడుతున్నారు. నిరుడు వరద ప్రభావంతో ఆకేరు వాగు పరీవాహక ప్రాంతాల్లోని పంటలు, బావులు, బోర్లు, మోటర్లు కొట్టుకపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం నీరు లేక వాగులో పెద్ద గుంతలను తీసి వంతులవారీగా మోటర్లు పెట్టుకొని పంట పొలాలను కాపాడుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నీళ్లతో వేసవిలోనూ చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, వాగులు, బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండేది. దీంతో ఆకేరు వాగు పరిసర ప్రాంతాలతోపాటు గ్రామాల్లో పంటలు పుష్కలంగా పండేవి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని వాగులోకి విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ఈ ప్రాంత అన్నదాతలు వేడుకుంటున్నారు.
లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతున్నయ్
తండా ధర్మారం శివారులో సుమారు 200 ఎకరాల వరకు ఆకేరు వాగును నమ్ముకొని 42 మోటర్లతో పంటలను పండిస్తున్నారు. కరెంట్ సమస్యతో ఈ ప్రాంతంలో మోటర్లకు ఆటోమేటిక్ స్టార్టర్లతో పంట పొలాలకు నీరందిస్తున్నారు. లోవోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయి. ఈ రెండు నెలల్లోనే ఒక్కో రైతుకు చెందిన మోటర్ మూడు, నాలుగుసార్లు కాలిపోయినయ్.
– నాగేశ్వరరావు, మోటర్ మెకానిక్
వంతులవారీగా నీళ్లు పారించుకుంటున్నం
ఆకేరు వాగులో నీళ్లు లేక నలుగురైదుగురం కలిసి పెద్ద గుంత తవ్వి మోటర్లు పెట్టి వంతుల వారీగా పంటకు నీళ్లు పారించుకుంటున్నం. లోవోల్టేజీ సమస్యతో కరెంటు సరిగ్గా రాక రెండు నెలల్లోనే మూడు సార్లు మోటర్ కాలింది. ఒక్కసారి మోటర్ రిపేరుకు రూ.3 వేలు ఖర్చవుతున్నది. అసలే నీళ్లకు ఇబ్బందవుతుంటే కరెంట్ సమస్య తలనొప్పిగా మారింది.
– గుగులోతు లక్ష్మి, రైతు, తండాధర్మారం, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా