హైదరాబాద్,జూన్ 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 1980 నుంచి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నా..2010లో అమలు చేస్తారని ప్రచారం జరిగినా అదిసాధ్యం కాలేదు. తాజాగా ఇదే అంశం మళ్లీ తెరమీదికి రావడం చర్చనీయాంశమైంది. నెహ్రూ జూలాజికల్ పార్ పబ్లిక్ గార్డెన్స్ నుంచి పూర్వపు జూ ఎన్క్లోజర్లను మార్చిన తర్వాత 1963లో బహదూర్‌పురాలో ప్రారంభించారు. 380 ఎకరాల్లో విస్తరించిన ఈ జూపార్క్ అపుడు హైదరాబాద్ వెలుపల ఉన్నా ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా మారింది. ధ్వని, వాయుకాలుష్యంతో పాటు భారీ వర్షాల సమయంలో మీర్ఆలం ట్యాంక్ నుంచి వరదనీరు జంతుప్రదర్శనశాలలోని కొంత భాగాన్ని ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి.
ఇదే వరదలు, వాయు, శబ్దకాలుష్యాన్ని కారణంగా చూపుతూ జూపార్క్‌ను షాద్‌నగర్‌లోని కమ్మదనం ఫారెస్టుకు తరలిస్తున్నారని.. దీని వెనుక రియల్ వ్యాపారమే ఎజెండాగా ఉందని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. షాద్‌నగర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించినట్టు సమాచారం. షాద్‌నగర్ రెవెన్యూ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కమ్మదనం రిజర్వ్ ఫారెస్ట్ 824 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది నగరానికి దూరంగా ఉన్నందున కాలుష్యం లేకుండాజంతుప్రదర్శనశాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం మీర్ ఆలం చెరువు సమీపంలో హైదరాబాద్ జూపార్క్ విస్తరించి ఉన్న సుమారు 300 ఎకరాల భూమిపై ఓల్డ్‌సిటీలోని రియల్టర్లు ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం. మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ ఉన్న భూమిని జంతుప్రదర్శనశాలను కమ్మదనంకు మార్చిన తర్వాత నివాస, వాణిజ్య ప్రాంతంగా మార్చే ఆలోచన ఉన్నట్టు ప్రచారం ఉంది. జూ ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు బిల్డర్లు కూడా ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఈ ప్రణాళికను అమలు చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు.
నగరానికి 45 కి.మీ దూరానికి తరలిస్తే సందర్శకుల రద్దీ తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు మురుగునీటి శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహాయం చేసే విధంగా జూపార్క్‌ను నగర సరిహద్దులకు తరలిస్తే పర్యావరణం మరింత దెబ్బతినే అవకాశాలుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రతిపాదన వచ్చిందని, ఆ తర్వాత ప్రతిపాదనలను నిలిపివేసినట్టు భావించామని, తిరిగి ఆ ప్రణాళికను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తే వ్యతిరేకిస్తామని పర్యావరణ వేత్తలు వెల్లడించారు.
జూపార్క్ తరలింపుపై అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఈ ఊహాగానాలన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. జూను తరలించడం ఆచరణాత్మకంగా చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పారు. మూడు దశాబ్దాలుగా ఇలాంటి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయన్నారు. జూ తరలింపులో మొదటగా పునరావాసం కోసం సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి పొందాలని, కొత్త స్థలంలో జంతుప్రదర్శనశాలను స్థాపించడానికి అదే పరిమాణంలో భూమిని గుర్తించాలని సదరు అధికారి తెలిపారు. ఇంకా, పునరావాసం చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. ఒక టైగర్ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇది కాకుండా, పులుల ఆవాసాల సృష్టికి కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుందని అన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఇది చాలా సవాలుగా ఉంటుందని అధికారి తెలిపారు.