Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతిపరుడైన అదానీకి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. అదానీ ఇచ్చే పైసలతోనే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు. అదానీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపుననిస్తారు. అధిష్ఠానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలకపలుకులు పలుకుతూ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆందోళనల్లో పాల్గొంటారు. కానీ తెలంగాణలో కంపెనీలు పెట్టుకునేందుకు మాత్రం అదానీకి ఎర్రతివాచీపరచి ఆహ్వా నం పలుకుతారు.
తెలంగాణలో కంపెనీలు పెట్టుకోవాలంటూ శాలువా కప్పి సత్కరించిన రేవంత్ సర్కారుకు అదానీ కూడా అంతే ఆత్మీయతతో విరాళాల చెక్కులు అందిస్తుంటారు. అవి కూడా ఒకటో రెండో కోట్లకు కాదు రూ.100 కోట్లకు. కాంగ్రెస్‌కు జాతీయస్థాయిలో ఒక నీతి, రాష్ట్ర స్థాయిలో ఒక రీతి ఉంటుందా అని అంతా ముక్కున వేలేసుకుంటారు. ఈ తంతంగమేంటో ఎవరికీ అర్థం కాదు. కానీ తెరవెనుక చిత్రాలు బయటకు వస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది. గతంలో రేవంత్ వియ్యంకుడికి అదానీ భారీ సాయం చేశారని, అందు కు ప్రతిఫలంగానే రేవంత్‌రెడ్డి అదానీకి లబ్ధి కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దివాలా కంపెనీకి కేంద్రం అండ
రేవంత్ వియ్యంకుడు గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన కంపెనీ నెక్సస్ ఫీడ్స్. 2006లో ఏర్పాటైన ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కంపెనీలో డైరెక్టర్లందరూ గొగులూరి కుటుంబ సభ్యులే. 2020లో కంపెనీ దివాలా తీసినట్టు డైరెక్టర్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా’కు దరఖాస్తు చేసుకున్నారు. 213.57 కోట్లు సాయం చేయాలని కోరారు. కేంద్రం 2021 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య విడతల వారీగా రూ.213.57 కోట్లను నెక్సస్ ఫీడ్స్‌కు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉదారత వెనుక అదానీ చొరవ ఉందని ప్రచారం జరుగుతున్నది. అదానీ మంత్రాంగంతోనే కేంద్రం నిధులు ఇచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వియ్యంకుడి కోసం జనం సొమ్ము వితరణ
దివాలా తీసిన వియ్యంకుడి కంపెనీని ఆదుకున్నందుకే అదానీకి తెలంగాణలో రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో అదానీ వ్యాపార విస్తరణకు రేవంత్ గేట్లు తెరిచారని తెలుస్తున్నది. అందుకే నల్లగొండ జిల్లాలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ ప్లాంటు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని ప్రచారం నడుస్తున్నది. అదానీకి వ్యతిరేకంగా నడిబజారులో ఆందోళనల పేరిట ఓ నాటకం.. నాలుగు గోడల మధ్య మరో తతంగం అని వ్యాపారవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది.