జగిత్యాల/జగిత్యాల రూరల్/జగిత్యాల అర్బన్/ కోరుట్ల, జూన్ 24 : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీని వీడడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. జగిత్యాలలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి, ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టా రు. సంజయ్ ఇంటిని, దవాఖానను ముట్టడించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మెట్‌పల్లిలోని పాత బస్టాండ్, రాజన్న సిరిసిల్ల జిల్లా , పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను జగిత్యాలలో తిరుగనివ్వబోమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీలో నిలువాలని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దాడని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. సంజ య్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఒకసారి ఓడినా రెండుసార్లు గెలవడానికి ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
నమ్మక ద్రోహానికి ప్రతిరూపం ఎమ్మెల్యే సంజయ్ అని జడ్పీచైర్‌పర్సన్ వసంత మండిపడ్డారు. బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి, మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
సంజయ్‌కుమార్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ పోటీకి రావాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు. 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరడం దురదృష్టకరమన్నారు.
ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో కృషి చేశాయన్నారు. సంజయ్‌ని తన గురువుగా భావించానని, ఇప్పుడు ఆయనను చూసి సిగ్గుపడుతున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టు లో శిక్ష పడటం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరడం అనైతిక చర్య అని ఆయన అభివర్ణించారు. డాక్టర్ సంజయ్‌కు బీఆర్ఎస్సే రాజకీయాలను పరిచయం చేసిందని, ఆయన విజయానికి ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేశారని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రె స్సా? రేవంత్ కాంగ్రెస్సా ? చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కండ్ల డాక్టర్ అని కండ్లల్లో పెట్టి చూసుకుంటే ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల ప్రజల కండ్లల్లో కారం కొట్టారని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ఆరోపించారు. సంజయ్‌ను గెలిపించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారానికి వెళ్లి అస్వస్థతకుగురైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీ అధినేత కేసీఆర్ నమ్మకాన్ని, ప్రజల విశ్వసాన్ని కాలరాసి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్‌కు జగిత్యాల ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు.