హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆమె భర్త రాబర్ట్ వాద్రా శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల పర్యటనకు రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. పలు ఆలయాలు సందర్శించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చాన ని చెప్పారు. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, కూతురు భద్రత విషయంలోనూ అప్పుడప్పుడు ఆందోళనగా అనిపిస్తుందని చెప్పారు. మహిళలతో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పితేనే అది సాధ్యం అవుతుందన్నారు. ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ కూడా చెప్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో తాను పవర్ సెంటర్ కావడంపై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఐదేండ్ల తర్వాత ఆ మార్పును చూస్తారని అన్నారు.