హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాలేజీల అనుమతులన్నీ ఓ మంత్రి సన్నిహితులకే దక్కినట్టు సమాచారం. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో 2 ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇవ్వగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత 19 నెలల్లో 35 నర్సింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో ఒక్కో కాలేజీ నుంచి రూ.60 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసినట్టు వినికిడి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైనా కొత్త నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే సంబంధిత శాఖ మంత్రి సంతకం చేసిన తర్వాతే ఆ అప్లికేషన్ ఫైనల్ అవుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే పలు నర్సింగ్ కాలేజీలు ఉన్న సదరు మంత్రి సన్నిహితులు సిండికేట్గా ఏర్పడి కొత్త వారికి కాలేజీలు దక్కకుండా చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. దరఖాస్తులకు సైతం ధర నిర్ణయించి, వాటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ కాలేజీలే కాకుండా ఎవరైనా ఒకేషనల్ కాలేజీ (ఏఎన్ఎమ్, ఎమ్ఎల్టీ కోర్సులు) కోసం అనుమతి కావాలని అధికారులను సంప్రదిస్తే సదరు మంత్రి నుంచి ఓ లెటర్ తేస్తేనే పని అవుతుందని నిర్మొహమాటంగా చెప్తున్నట్టు సమాచారం.
తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో కీలక పోస్టులో ఉన్న ఓ మహిళా అధికారి అన్ని తానై చక్రం తిప్పుతున్నట్టు సొంత శాఖ అధికారులే చెప్తున్నారు. ఏండ్లుగా ఒకే సీటులో పాతుకుపోయిన ఆ అధికారిణి త్వరలో రిటైర్ కావాల్సి ఉండటంతో పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ అధికారిణి సొంత కారును వాడుకుంటూనే.. ట్రాన్స్పోర్టు ఏజెన్సీ నుంచి కారును అద్దెకు తీసుకున్నట్టు లెక్కలు చూపుతూ నెలకు రూ.35 వేలు బిల్లులు మంజూరు చేయించుకున్నట్టు సమాచారం. అలా ఇప్పటివరకు సుమారు రూ.45 లక్షలు కాజేయడంతోపాటు నిబంధనలు పాటించని నర్సింగ్ కాలేజీల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసుకున్నట్టు, కొత్త కాలేజీలకు అనుమతులిచ్చేందుకు తన వాటా కింద రూ.15-20 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో సిండికేట్గా ఏర్పడిన కొందరికే కొత్త నర్సింగ్ కాలేజీల అనుమతులు ఇస్తున్నారని, నిబంధనలతో పని లేకుండానే వారికి అనుమతులు కట్టబెడుతున్నారని తెలుస్తున్నది. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు తమ కనుసన్నల్లో ఈ దందాను నడుపుత్నుట్టు సమాచారం. దీనిపై రేవంత్రెడ్డి సర్కారు దృష్టి సారించకపోవడం, నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో అక్రమాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.