Telangana | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తేతెలంగాణ) : పోలీస్ శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులకు ఉమ్మడి సర్వీసు నిబంధనలను వర్తింపజేయాల్సిన ఉన్నతాధికారులు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లను వెంటనే ఆ విధుల నుంచి రిలీవ్ చేసినప్పటికీ బెటాలియన్లలో పనిచేస్తున్న 29 మంది కానిస్టేబుళ్లకు మాత్రం ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాతే నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) అందజేశారు. దీంతో గత్యంతరం లేక రాజీనామా చేయాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ శాఖలో శాంతిభద్రతలు, బెటాలియన్, ఫైర్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్ తదితర విభాగాలుంటాయి. విధి నిర్వహణకు సంబంధించిన కొన్ని మినహాయింపులు తప్ప ఆ విభాగాల్లోని ఉద్యోగులందరికీ ఒకే సర్వీసు రూల్స్ అమలు చేస్తారు. ఇతర శాఖల్లో ఉద్యోగాలు పొందిన పోలీసులను రిలీవ్ చేసే విధానం ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. కానీ, ప్రస్తుతం ఉన్నతాధికారులు ఈ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజీనామా చేస్తేనే ఎన్వోసీ ఇస్తామని చెప్తున్నారు.
రాష్ట్రంలోని 13 బెటాలియన్లకు చెందిన 29 మంది కానిస్టేబుళ్లు డీఎస్సీ-2024లో టీచర్ ఉద్యోగాలు సాధించారు. వారు ఎన్వోసీ కోసం తమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో దరఖాస్తు చేయగా కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాకే ఎన్వోసీ ఇస్తామని ఏవోలు స్పష్టం చేశారు. దీంతో రాజీనామా చేసిన 28 మంది ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కమాండెంట్ మురళికృష్ణను ‘నమస్తే’ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వ్యవహరిస్తామని చెప్పారు.