జయశంకర్ భూపాలపల్లి, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డలోని మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్‌తో తొలగించి తిరిగి నిర్మిస్తే సరిపోతుందని ఈఎన్సీ మురళీధర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ బరాజ్ చుట్టూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు తెరపడడం లేదు. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో 20వ పిల్లర్ కుంగడంతో పక్కనే ఉన్న 19, 21 పిల్లర్లపై భారం పడింది.
ఈ నేపథ్యంలో ఈ మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్‌తో తొలగించి తిరిగి నిర్మించాలని ఈఎన్సీ పేర్కొన్నారు. విచారణ పూర్తయితే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ పిల్లర్లను నిర్మించేందుకు సిద్ధంగా ఉందని మంత్రుల సాక్షిగా మేడిగడ్డ వద్ద ఇరిగేషన్ అధికారుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో వివరించారు. ప్రాజెక్టు పరిస్థితిపై గతంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే బరాజ్‌పై నెలరోజులుగా రోజుకో అసత్య ప్రచారం జరుగుతున్నది. విచారణ పేరిట మరమ్మతు పనులను జాప్యం చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రచారం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నత్తనడకన విచారణ
బరాజ్ ఇన్వెస్టిగేషన్ పనులను డైనాసార్, హట్సన్ ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించింది. నెల రోజులుగా విచారణ సాగుతూనే ఉంది. ఈ క్రమంలో బరాజ్‌పై రోజుకో అసత్య ప్రచారం తెరపైకి వస్తున్నది. కొత్త లోపాలను ఎత్తిచూపడం ద్వారా నిర్మాణ పనులను జాప్యం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం బరాజ్ వద్ద డైనాసార్, హట్సన్ ఏజెన్సీలు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు చేస్తున్నాయి. ఏడో బ్లాక్ వద్ద కాఫర్ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు అన్నారం బరాజ్‌లో 38,28 ఔట్లెట్ల వద్ద గల సీపేజ్‌లకు ఆప్కాన్స్ సంస్థ మొదటి విడత కెమికల్ గ్రౌటింగ్ పనులు పూర్తి చేసింది.
మూసిన సీపేజ్లలోని నీరు మరోచోటి నుంచి వచ్చే అవకాశాలున్నాయా? అని పరిశీలిస్తున్నారు. బరాజ్‌లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సాధారణమేనని, ఏటా ఇలాంటి రిపేరబుల్ సమస్యలకు మెయింటెనెన్స్ చేస్తూ వెళ్తుంటామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఇంజినీర్లు చెప్తున్నారు. బ్యాంకర్లు సైతం ప్రతి ఏడాది ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించి వెళ్తుంటారని, ఇది కొత్తేమీ కాదని, ప్రస్తుతం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి రాద్దాంతం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.