న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు చేతులు ఎత్తేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తేల్చి చెప్పేశారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. సెప్టెంబర్ 30లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇంకో 10 రోజుల్లో హైకోర్టు పెట్టిన గడువు ముగిసిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్యాచరణపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు.
హైకోర్టు పెట్టిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు నిర్ణయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఇంత స్వల్ప సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని చేతులెత్తేశారు. 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లులు పంపి దాదాపు నాలుగున్నర నెలలు గడిచిపోయాయని గుర్తుచేశారు. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై తుదితీర్పు వచ్చే వరకూ ఎదురు చూస్తామని తెలిపారు. అప్పటివరకు తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను హైకోర్టుకు వివరించి మరింత గడువు కోరుతామని స్పష్టంచేశారు.