హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడకపోతే వరి రైతుకు మార్కెట్టే గతయ్యే పరిస్థితి ఏర్పడనున్నది. కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఎంతమాత్రం లేదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ వని పేర్కొంటున్నారు. కేంద్రం కుట్రలను ముందుగానే పసిగట్టిన సీఎం కేసీఆర్ యాసంగిలో రైతులు వరి వేయవద్దని, ఇతర పంటలపై దృష్టి సారించాలని అప్రమత్తం చేశారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకొన్న 60 శాతం మంది రైతులు వరిసాగు చేపట్టలేదు. భూమి స్వభావం, వ్యక్తిగత అవసరాలు, రాష్ట్ర బీజేపీ నేతల మాయమాటలకు తోడు కేసీఆర్ గిప్పుడు గట్లనే అంటడు.
మళ్లీ ఆయనే కొంట డు.. లేదంటే కేంద్రంతో కొనిపిస్తడు.. అనే ప్రచారం తోడవ్వడంతో దాదాపు 40 శాతం మంది రైతులు వరి సాగు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండికేయడంతో రైతులు పండించిన ధా న్యాన్ని అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారనున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ చెప్పిన నేపథ్యంలో.. రైతులు మోసపోకుండా చూ సేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది.
మార్కెట్ కమిటీలు మాత్రం తెరిచే ఉంటాయ ని పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు, దళారు లు అడ్డగోలుగా రైతులను దోపిడీ చేయకుండా నివారించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ధరల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నదని సమాచారం. రైతులను మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచుతుందని అధికారులు చెప్తున్నారు. రైతులకు నష్టం జరిగే పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం జోక్యం చేసుకొంటుందని అంటున్నారు.