హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఎక్కడయినా సరే ఆయకట్టుకు అనుగుణంగా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ప్రతిపాదిస్తారు. అవసరమైతే కాస్త ఎక్కువగానే నీటిని డిమాండ్ చేస్తారు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, భీమా ప్రాజెక్టునే ప్రశ్నార్థకంగా మార్చుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కొడంగల్ కోసం రాజీవ్‌భీమా పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎసరుపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా ఒక టీఎంసీతో 20 వేల ఎకరాలకు సాగునీరిచ్చేలా లెక్కలు గట్టి, భీమా ఆయకట్టుకే ముప్పు తెచ్చిపెటారనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఆ అసంబద్ధ లెక్కలతోనే భీమా లిఫ్ట్ స్కీమ్‌కు కేటాయించిన నికర జలాల్లో కోత విధించి మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్‌నకు కేటాయించారు. సర్కార్ చర్య వల్ల భీమా లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారడమే కాదు.. ట్రిబ్యునల్‌లో తెలంగాణ చేస్తున్న వాదనలకు తీవ్ర విఘాతంగా పరిణమిస్తుందని, తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని ఇరిగేషన్‌వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సాగునీటిరంగ నిపుణులు సైతం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.
రాజీవ్‌భీమా లిఫ్ట్ స్కీమ్ కింద ఒక టీఎంసీతో 10 వేల ఎకరాల వంతున, మొత్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఉమ్మడి రాష్ట్రంలో ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుకు మొత్తంగా 20 టీఎంసీలు కేటాయించగా, అందులో తాగునీటి అవసరాలు 1.54 టీఎంసీలు, ట్రాన్స్మిషన్, ఆవిరినష్టాలు 2.40 టీఎంసీలు ఉంటాయని అంచనా. వాటిని మినహాయిస్తే లిఫ్ట్ స్కీమ్ కింద సాగునీటికి నికరంగా కేటాయించినవి 16.94 టీఎంసీలే. ఆ జలాలతోనే రెండు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి తెలంగాణకు ఉమ్మడి పాలకులు అన్యాయం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకంగా భీమా ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థం చేస్తున్నారు.
ఇప్పటికే కేటాయించిన ఆ అత్తెసరు జలాల్లోనూ రేవంత్‌రెడ్డి సర్కార్ కోత విధించింది. ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు సాగునీరిస్తామని, తద్వారా 7.33 టీఎంసీలు ఆదా అవుతాయని లెక్కలు గట్టింది. అలా ఆదా చేసే జలాలను మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ స్కీమ్‌కు కేటాయించింది. ఇదిలాఉంటే, కోత విధించిన జలాలు పోగా రాజీవ్‌భీమా లిఫ్ట్ స్కీమ్ ఆయకట్టుకు 9.41 టీఎంసీలు మాత్రమే మిగులుతున్నాయి. భీమా స్కీమ్ ఆయకట్టు డ్యూటీ రెట్టింపు అవుతున్నది. ఒక టీఎంసీతో 20 వేల ఎకరాలకు ఏ ప్రాతిపదికగా, ఏ విధానం ద్వారా పారిస్తారనేది అంతుచిక్కడం లేదు.
ఈ లెక్కలపై ఇరిగేషన్ శాఖ అధికారులే విస్తుపోతున్నారు. టెయిల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్, తదితర సాగునీటి యాజమాన్య పద్ధతులను అనుసరించినా కూడా టీఎంసీతో 10 వేల ఎకరాలకు సాగునీరివ్వడమే కష్టమని చెప్తున్నారు. పొరుగున ఆంధ్రప్రదేశ్‌లో ఒక టీఎంసీతో ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వడంలేదు. మరి ఒక టీఎంసీతో 20వేల ఎకరాల ఆయకట్టు నీళ్లు ఇవ్వడం ఎలా సాధ్యమంటూ ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. సర్కార్ తీరు వల్ల భీమా ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ తీరు వల్ల ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న తెలంగాణ వాదనలను బలహీనపరచే దుస్థితి నెలకొంటున్నదని ఇరిగేషన్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ కరువు పీడిత ప్రాంతమని, పరీవాహక ప్రాంతం ఆధారంగా ఎక్కువ మొత్తంలో కృష్ణా జలాల్లో నీటివాటాను కేటాయించాలని తెలంగాణ వాదిస్తున్నది. ఆ మేరకు ప్రాజెక్టుల అవసరాలను చూపుతూ, కొత్త ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ సైతం అవే అవసరాలు, అంశాలను పరిశీలిస్తుంది. పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో జరుగుతున్న వాదనలకు విరుద్ధంగా ముందుకు సాగుతున్నది.
కొడంగల్ లిఫ్ట్‌నకు అదనంగా నికర జలాలు కేటాయించాలని కోరడంలేదు. భీమా ప్రాజెక్టుకు కేటాయించిన నికర జలాల్లోనే డ్యూటీ పెంచి ఆదా చూపుతూ సొంతంగా కొడంగల్ లిఫ్ట్‌నకు కేటాయించింది. ఇది ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలకు తీరని విఘాతమని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ చేస్తున్న డిమాండ్లన్నింటినీ, చేస్తున్న వాదనలన్నింటినీ సర్కార్ చేస్తున్న కేటాయింపులే బలహీనం చేస్తున్నాయని వివరిస్తున్నారు. అంతిమంగా ట్రిబ్యునల్‌లో తెలంగాణ నీటివాటాకు తీరని ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకమే కాదు.. కొడంగల్ లిఫ్ట్ సైతం ఆచరణలో అసాధ్యమనే అభిప్రాయాలు ఇంజినీర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. భీమా లిఫ్ట్ నుంచి కోత విధించిన 7.33 టీఎంసీలను కొడంగల్ లిఫ్ట్‌నకు కేటాయించారు. అందులో ఒక టీఎంసీ మేర తాగునీటి అవసరాలు ఉన్నాయి. అవి పోను 6.33 టీఎంసీలతో లక్ష ఎకరాలకు సాగునీరందించేలా లిఫ్ట్ స్కీమ్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రతిపాదించింది. అంటే ఒక టీఎంసీతో 16.66 వేల ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ మొత్తం సామర్థ్యమే మూడు టీఎంసీలు. ఇదిలాఉంటే, కొడంగల్ లిఫ్ట్‌ను నేరుగా జూరాల నుంచి చేపట్టడం లేదు.
భీమా ప్రాజెక్టు మొత్తంలో నీటినిల్వకు భూత్పూర్, సంగంబండ, రంగసముద్రం, శంకరసముద్రం రిజర్వాయర్లు ఉండగా, వాటి మొత్తం నిల్వ సామర్థ్యం 8.3 టీఎంసీలే. భీమా స్కీమ్‌లో ప్రధానమైన, మొదటిదైన భూత్పూ ర్ రిజర్వాయర్ (1.3 టీఎంసీలు) నుంచే ప్రస్తుతం నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ రిజర్వాయర్ నుంచే ఏడు టీఎంసీల జలాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇది కూడా రాజీవ్‌భీమా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు. ఇటు భీమా ఆయకట్టు ప్రశ్నార్థకం కావడమే కాకుండా, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించతలపెట్టిన కొడంగల్ లిఫ్ట్ కూడా నిరుపయోగంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ట్రిబ్యునల్-1 దాదాపు 183 టీఎంసీలను చారిత్రక రక్షణల కింద కృష్ణా డెల్టాకు కేటాయించింది. డెల్టా కాలువల ఆధునికీకరణ వల్ల ఆ జలాల్లో మొత్తంగా 29 టీఎంసీల మేరకు మిగులు ఏర్పడుతుందని చూపారు. ఆ 29 టీఎంసీల్లో 9 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రం కేటాయించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 20 టీఎంసీలను రాజీవ్‌భీమా ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు కేటాయించారు. ఆ మేరకు భీమా ప్రాజెక్టుకు టీఏసీ (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) అనుమతులు సైతం తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు డ్యూటీని ఒక టీఎంసీతో 10 వేల ఎకరాల నుంచి 15 వేల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్తున్నారు. తద్వారా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల నికర జలాల్లోనూ 7.33 టీఎంసీలను ప్రభుత్వం ఆదా కింద చూపుతున్నది. కానీ ఎక్కడ, ఏవిధంగా ఇస్తారు? అనేది చెప్పడం లేదు. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుతో భీమా ప్రాజెక్టుకు మరోసారి టీఏసీ అనుమతులు తీసుకోవాల్సిన ఉంటుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

(నోట్: ప్రస్తుతం స్కీమ్ కింద 1.58 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇంకా దాదాపు 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉండగా, ఆ పనులు కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే, భీమా ప్రాజెక్టుకే అదనంగా మరో 4 టీఎంసీలకుపైగా అవసరమవుతాయి)