Telangana | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఏదైనా నేరం/సంఘటన జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్లలో తెలుగులోనే ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా బాధితులను తెలుగులోనే ప్రశ్నలు అడుగుతున్నారు. సాక్షులు, ఇతర వ్యక్తుల నుంచి తెలుగులోనే సమాచారం సేకరిస్తున్నారు. నిందితులను సైతం తెలుగులోనే విచారిస్తున్నారు. కానీ, శాఖాపరంగా ఎఫ్ఐఆర్ నమోదు నుంచి చార్జిషీట్ వరకు మొత్తం ఇంగ్లిష్‌లో చేయాల్సి వస్తున్నది. విచారణ ప్రక్రియ మొత్తం మాతృభాషలోనే జరుగుతున్నా.. అంతర్గతంగా తెలుగును ఉపయోగించడంలో మాత్రం వివక్ష కొనసాగుతున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చార్జిషీట్లను కేవలం ఇంగ్లిష్‌లో తయారు చేయాలన్న సంప్రదాయం కొనసాగుతున్నదని, అందుకే ఎఫ్ఐఆర్ నుంచే తెలుగును వాడటం మానేశారని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ శాఖలో కొందరు ఉన్నతాధికారులు తెలుగులో చార్జిషీట్ దాఖలు చేస్తే తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరికి తెలుగు అర్థం కాదని, దీంతో వారు ఇంగ్లిష్‌ను ప్రోత్సహిస్తున్నారని చెప్తున్నారు. కొన్నేండ్లుగా ఇదే జరుగుతుండటంతో ఇప్పుడు ఇంగ్లిష్‌లోనే చార్జిషీట్ అనేది ఒక అనధికారిక నిబంధనగా మారిందని చెప్తున్నారు. వాస్తవానికి న్యాయస్థానాల్లో చార్జిషీట్ ఇంగ్లిష్‌లోనే వేయాలన్న నిబంధన ఏమీ లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. చార్జిషీట్‌ను ఇంగ్లిష్‌లో వేసినా, తెలుగులో వేసినా కోర్టులు తిరస్కరించబోవని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికీ 10-15 ఏండ్ల కిందటి కేసులు పరిశీలిస్తే తెలుగులో దాఖలు చేసిన చార్జిషీట్లు కనిపిస్తాయని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు యూనిట్ ఆఫీసర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో తెలుగులో మాట్లాడగలరా? అర్థం చేసుకోగలరా? అని తెలుసుకునేందుకు పరీక్ష పెడతారని సమాచారం. దాని ఫలితం ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తారని చెప్తారు. కానీ, కొన్నేండ్లుగా అధికారులు ఈ పరీక్షను పెద్దగా పట్టించుకోకుండా, ఏదో ఒక విధంగా నేరుగా పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. అందుకే వారికి స్థానిక భాషపై పట్టు ఉండటం లేదని, అందుకే ఇంగ్లిష్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చార్జిషీట్లను తెలుగులో తయారు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని భాషాభిమానులు చెప్తున్నా రు. బాధితులు తెలుగులోనే తమకు జరిగిన అన్యాయాన్ని, తమ ఆవేదనను వివరిస్తారని గుర్తుచేస్తున్నారు. పోలీసులు సైతం తెలుగులోనే ఆరా తీస్తారని, సాక్షులు తెలుగులోనే సమాధానం ఇస్తారని చెప్తున్నారు. నిందితులను గుర్తించి, విచారించే క్రమం లో పోలీసులు తెలుగులోనే ప్రశ్నలు అడుగుతారని, సమాధానాలు రాబడతారని వివరిస్తున్నారు. కానీ, చార్జిషీట్‌ను ఇంగ్లీష్‌లో తయారు చేయాల్సి వస్తుండటంతో ఫిర్యాదు మొదలు సేకరించిన సమాచారం మొత్తాన్ని అనువదించాల్సి వస్తున్నదంటున్నారు.
ఇది కిందిస్థాయి సిబ్బందికి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు (ఎస్‌హెచ్‌వో), ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లకు (ఐవో) పెను సవాల్‌గా మారిందని పేర్కొంటున్నారు. దీంతో చాలామంది అనువాదం కోసం ఔట్ సోర్సింగ్‌పై ఆధారపడాల్సి వస్తున్నదని చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు చెప్పిందొకటి.. రాసిందొకటిగా మారిపోతున్నదని పేర్కొంటున్నారు. చివరికి న్యాయస్థానాలకు వెళ్లినప్పుడు న్యాయవాదులో, న్యాయమూర్తులో తప్పులు గుర్తిస్తున్నారని చెప్తున్నారు. ఫలితంగా కోర్టులు ఆ చార్జిషీట్లను తిరస్కరిస్తున్నాయని అంటున్నారు. దీంతో ప్రక్రియ మళ్లీ మొదటికి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందడం లేదని, వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని, డబ్బు, సమయం వృథా అవుతున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకొని తెలుగులో కూడా చార్జిషీట్లు దాఖలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు.
చార్జిషీట్లను తెలుగులో కూడా తయారు చేసి, దాఖలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ మేరకు అటు పోలీసులకు, ఇటు న్యాయస్థానాలకు మార్గదర్శకాలు జారీచేయాలి. బీఎన్ఎస్ సెక్షన్ 307 ప్రకారం దిగువ కోర్టుల్లో ఏ భాషను ఉపయోగించాలో సూచించే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. ఇంగ్లిష్‌లోనే చార్జిషీట్ దాఖలు చేయాలన్న ఆదేశాలతో 90 శాతం మంది పోలీస్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమాచారాన్ని అనువాదం చేసేందుకు ఎస్‌హెచ్‌వోలు, ఐవోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రైవేట్ టైపిస్టులపై ఆధారపడాల్సి వస్తున్నది.
ఇది వారికి ఆర్థికంగా భారం కావడంతోపాటు టైపిస్టులకు న్యాయ సంబంధ పదాలు, సాంకేతిక పదాలపై పెద్దగా పట్టులేకపోవడంతో చార్జిషీట్ల తయారీ ఆలస్యమవుతున్నది. చార్జిషీట్లలో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో కోర్టుల్లో తిరస్కరణకు గురవుతూ, కేసులు దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని తెలుగులోనూ చార్జిషీట్లు దాఖలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది పోలిస్ శాఖ పనితీరును పెంచడమే కాకుండా, బాధితులకు సత్వర న్యాయం అందేందుకు తోడ్పడుతుంది.
– డాక్టర్ మంగారి రాజేందర్, మాజీ డైరెక్టర్, తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ