Big tv | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోని ఓ బడా నేతకు చెందిన చానల్.. ‘బిగ్’బాస్ మాదిరిగా అటు ప్రభుత్వంలో, ఇటు అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ చానల్‌కు చెందిన ఓ రిపోర్టర్ ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్‌ను ‘ఈ కుర్చీలో కూర్చునే అర్హత ఉందా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందినదిగా చెప్పుకొనే ఆ చానల్లో అధికారులను కించపరచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వంలోని ఆ బిగ్‌బాస్ తలుచుకుంటే అధికారులను బదిలీ చేయొచ్చని.. కానీ అలా కాకుండా అధికారులపై ఇలా బురద చల్లి అవమానించడం ఏమిటని చర్చిస్తున్నారు. ‘ఆ చానల్ ఎవరిదో అందరికీ తెలుసు. సిన్సియర్ ఆఫీసర్‌గా పేరుతెచ్చుకున్న ఆ అధికారిని ఎందుకు టార్గెట్ చేసినట్టు?’ అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థ యజమాని ఇటీవల ‘పెద్ద తలకాయలతో’ కలిసి విదేశాలకు వెళ్లడం, పర్యటనలో అన్నీ తానై వ్యవహరించడంతో అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో ఓ ఐపీఎస్ అధికారిని, మెట్రో రైలుకు చెందిన ఓ ఉన్నతాధికారిని కూడా ఇలాగే అవమానించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ ప్రతినిధులు ‘మాది ప్రభుత్వ చానల్’ అంటూ అధికారులందరిని ఇలాగే బెదిరిస్తున్నారని, మొదట సమాచారం తమకే ఇవ్వాలని కచ్చితంగా చెప్తున్నారట. దీంతో ఆ చానల్ వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది. బిగ్ బాస్‌కు తెలిసే ఇదంతా జరుగుతున్నదా? లేదా? ఆయన పేరు చెప్పుకొని వీళ్లు రెచ్చిపోతున్నారా? అని అధికార పార్టీలోనూ గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం.