అశోక్‌నగర్.. ఇది నిరుద్యోగులకు ఒక ఆశాకిరణం. ఇప్పటికే వివిధ హోదాల్లో స్థిరపడ్డ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పెద్దపెద్ద వ్యాపారులకు దశదిశ చూపిన ‘చదువులమ్మ ఒడి’. వందల సంవత్సరాలుగా ఎంతో మందికి ‘శిక్షణ’నిచ్చి ఉన్నతస్థానాల్లో నిలబెట్టిన ఈ ‘లర్నింగ్ పాయింట్’ ఉన్నట్టుండి బోసిబోయింది.
‘ఏటా రెండు లక్షల ఉద్యోగాలు’ అన్న కాంగ్రెస్ హామీ కారణంగా కొలువుల ఆశలతో అశోక్‌నగర్ బాట పట్టాల్సిన నిరుద్యోగులు.. నిరాశగా ఇంటిబాటపడుతుండటంతో ఈ ‘ఎడ్యుకేషనల్ హబ్’ ఇప్పుడు ఖాళీగా మారుతున్నది. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టేవారు లేక సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిజంగానే ‘సైలెన్స్’ బోర్డుతో పనిలేకుండా పోయింది. లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులకు నీడనిస్తూ.. కడుపునింపుతూ బతుకీడుస్తున్న చిరు వ్యాపారులు గిరాకీ లేక దిక్కులు చూడాల్సి వస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఎల్బీనగర్/చిక్కడపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నిత్యం విద్యార్థులు, నిరుద్యోగులతో కళకళలాడాల్సిన అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వందలాది మందితో కిటకిటలాడాల్సిన సిటీ సెంట్రల్ లైబ్రరీ వెలవెలబోతున్నది. విద్యార్థులతో కిక్కిరిసిపోవాల్సిన కోచింగ్ సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండాల్సిన అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, దిల్సుఖ్నగర్ ప్రాంతాలు సెలవు రోజుల నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపించే టీస్టాళ్లు, హోటళ్లు, కర్రీ పాయింట్లు, జ్యూస్ సెంటర్లు గిరాకీ లేక దిక్కులు చూస్తున్నాయి.
మెస్‌లు, హాస్టళ్లకు తాళాలు వేలాడుతున్నాయి. జిరాక్స్, నెట్ సెంటర్లు మూతపడుతున్నాయి. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి తమను వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ముఖం చాటేయడంపై నిరుద్యోగులు రగలిపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను భర్తీచేసి, నియామక పత్రాలు అందించి తామే 60 వేల ఉద్యోగాలిచ్చామని ప్రకటించుకొని కాంగ్రెస్ నేతలు చేతులు దులుపుకొన్నారని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.
అధికారంలోకి రాక ముందు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్.. నిండా ముంచిందని నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి గెలిపిస్తే నమ్మకద్రోహమే చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆందోళన చెందుతున్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎప్పుడూ ఏదో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలవుతుండటంతో అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేది. వందలాది మంది విద్యార్థులు లైబ్రరీతోపాటు బయట చెట్ల కింద కూర్చొని చదువుకునేవారు. విద్యార్థులు, నిరుద్యోగుల తాకిడికి లైబ్రరీ ప్రాంగణం కిటకిటలాడేది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విద్యార్థులతో నిండి ఉండేది. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరిట అరచేతిలో స్వర్గం చూపిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనూ అదే పరిస్థితి కొనసాగింది.
ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయేమోనని విద్యార్థులు ఆశపడ్డారు. కానీ.. రెండేండ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంతో నేడు నిరుద్యోగులు, విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ నమ్మకద్రోహాన్ని గ్రహించి హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లను ఖాళీచేసి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో సెంట్రల్ లైబ్రరీకి వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు రాకపోవడంతో స్టడీ చైర్లను మడతపెట్టి పక్కకు పడేస్తున్నారు. లైబర్రీ గదులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకరిద్దరు విద్యార్థులతో నేడు లైబ్రరీ ప్రాంగణమంతా బోసిబోయి కనిపిస్తున్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి హామీలను గుప్పించి తమను మోసం చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి కెరీర్‌ను నాశనం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగులు, విద్యార్థుల కోసం సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్‌ను ఏర్పాటుచేసింది. దీని ద్వారా నిరుద్యోగులకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తూ వస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేయలేని నిరుద్యోగులకు అన్నపూర్ణ క్యాంటీన్ వరంలా మారింది. గతంలో ఇక్కడ 500 నుంచి 600 మంది భోజనం చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో లైబ్రరీకి వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గింది.
ఉద్యోగార్థులపై ఆధారపడి ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన అనేక వ్యాపారాలు కళకళలాడేవి. నేడు వారంతా కాంగ్రెస్ చేతిలో మోసపోయి ఇంటి దారి పట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా సొంతూరి బాటపట్టారు. ఈ ప్రభావం టీస్టాళ్లు, కర్రీ పాయింట్లు, జ్యూస్ సెంటర్లు, హోటళ్లు, స్నాక్స్ సెంటర్లు, మెస్ సెంటర్లపై విపరీతంగా పడింది. ఉద్యోగార్థులు లేక వారంతా తమ వ్యాపారాలను మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 70% మేర వ్యాపారం తగ్గిందని ఓ హోటల్ యజమాని ఆవేదన వ్యక్తంచేశాడు. ‘రోజుకు 350 చాయ్‌లు అమ్మేవాడినని, ఇప్పుడు స్టూడెంట్స్ తగ్గడంతో 150 కూడా అమ్మడం కష్టంగా ఉంది.
ఈ వ్యాపారాన్ని నమ్ముకుని తాను తన కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇప్పుడు ఈ చాయ్ కొట్టు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని ఓ టీస్టాల్ వ్యాపారి వాపోయాడు. ‘అశోక్‌నగర్‌లో విద్యార్థుల సందడి ఉన్నదనే రెండేండ్ల క్రితం కర్రీ పాయింట్ ఓపెన్ చేశా. మొదట్లో బాగానే నడిచింది. దీంతో మరో రెండు గదులు అద్దెకు తీసుకుని మెస్ సెంటర్ ప్రారంభించా. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించనేలేదు’ అని కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న మహిళ తన ఆవేదనను వ్యక్తంచేసింది. ‘రాత్రి 11 గంటల వరకు జ్యూస్ సెంటర్‌కు విద్యార్థులు వచ్చేవాళ్లు. వచ్చినోళ్లందరికీ జ్యూస్ ఇవ్వడానికి సమయం ఉండేది కాదు’అని జ్యూస్ వ్యాపారి వాపోయాడు.
అన్ని జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు అశోక్‌నగర్, ముషీరాబాద్, రాంనగర్, దోమలగూడ, హిమాయత్‌నగర్, కవాడిగూడ, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ఇండ్లల్లో అద్దెకు ఉండేవారు. సెంట్రల్ లైబ్రరీ, స్టడీ హాళ్లకు వెళ్లి చదువుకునే వాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక చాలామంది ఇండ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు తరలివెళ్లారు. ఈ ప్రభావంతో పలు ఇండ్లల్లో టులెట్ బోర్డులు వెలిశాయి. గతంలో నెలకు రూ.8వేలుగా ఉన్న అద్దెను రూ.6,500 చేశామని ప్రణీత్ అనే ఇంటి యజమాని తెలిపాడు. టులెట్ బోర్డు పెట్టగానే వచ్చేది. ఇప్పుడు అలా లేదని వాపోయాడు.
అశోక్‌నగర్‌తోపాటు దిల్సుఖ్నగర్ కూడా ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందింది. ఇక్కడ కూడా వందలాది కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ హాస్టళ్లలో ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి దిల్సుఖ్నగర్ కళ తప్పుతున్నది. కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. గతంలో కోచింగ్ సెంటర్లలో కుర్చీలు సరిపోక భవనాలపై షెడ్లు వేసి, వరండాల్లో కూర్చోబెట్టి చదివించేవారు. ప్రస్తుతం దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్కో కోచింగ్ సెంటర్లో 2,000 నుంచి 4,000 మంది వరకు శిక్షణ పొందేవారు. ప్రస్తుతం ఏ ఇన్స్టిట్యూట్ చూసినా కేవలం 100 నుంచి 300 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. అది కూడా పోలీస్ ఉద్యోగానికి శిక్షణ కోసం వచ్చిన వారే ఉన్నట్టుగా తెలుస్తున్నది. విద్యార్థులు లేక భవనాల అద్దెలు చెల్లించలేకపోతున్నామని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు.
ఉద్యోగార్థులను నమ్ముకొని అశోక్‌నగర్‌లో చాలా మంది స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొదట్లో ఇవన్నీ నిండుగా ఉండేవి. కానీ కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇస్తదనే నమ్మకం పోవడంతో నిరుద్యోగులంతా పట్నం వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ ప్రభావంతో వారిని నమ్ముకుని ఉన్న స్టడీ హాళ్లు, హాస్టళ్లు బోసిబోయాయి. విశ్వనాథ్ అనే వ్యక్తి మూడు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాడు. జాబ్ క్యాలెండర్ రాలేదు.. విద్యార్థులు లేకుండాపోయారు. ఇప్పుడు ఒక్క సెంటరే నడుపుతున్నడు. దానిలో కనీసం 50 మంది కూడా లేరని అతను వాపోతున్నాడు. మరోవైపు హాస్టళ్లు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉద్యోగాల జాతర మొదలయ్యే అవకాశం ఉన్నదని ఓ వ్యక్తి రెండు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని హాస్టల్ నడిపాడు. ఏడాది బాగానే నడిచినా.. ఇప్పుడు విద్యార్థులు ఖాళీ అయ్యారు. దీంతో ఆ వ్యక్తి కనీసం అద్దె చెల్లించడానికి హాస్టల్ ఫీజు రూ.8,000 నుంచి రూ.4,500 వరకు తగ్గించాడు. ఇలా మూడు నెలలు నడిపిన అతడు హాస్టల్ క్లోజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.
మాది సూర్యాపేట. నేను ఇక్కడ మూడేండ్ల నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న. కాంగ్రెస్‌ను గెలిపించడానికి మేమంతా ఊరూరూ తిరిగాం. కానీ ఇలాంటి సర్కార్‌ను గెలిపించుకున్నందుకు సిగ్గుపడుతున్నం. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. మాకు ఒక్కొక్కరికీ నెలకు రూ.12,000కు పైగా ఖర్చు అవుతున్నది. కోచింగ్ ఫీజులు రూ.70 వేల వరకు ఉంటున్నాయి. నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఉన్నవాళ్లకు రేవంత్ సర్కార్ మొండిచెయ్యి చూపింది. దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ చౌరస్తాకు రావాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మాకు చెప్పాలి.
-దామోదర్‌రెడ్డి, పోటీ పరీక్షల అభ్యర్థి
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పాడు. ఏవీ ఆ ఉద్యోగాలు. హైదరాబాద్‌లో ఉండేందుకు ఖర్చులను పంపించడానికి మా తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారం కోసం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు.. ఇప్పుడు లోకల్‌బాడీ ఎన్నికల కోసం త్వరలో ఉద్యోగాల జాతర అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు లైబ్రరీ సందర్శన పెట్టి నిరుద్యోగులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లోనే మేం మోసపోయాం. మీ రాజకీయాలు మాకు అర్థమైనయి. కాంగ్రెస్ పనైపోయింది. నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోనే అది రుజువవుతుంది.
– నరేశ్, పోటీ పరీక్షల అభ్యర్థి
మాది నాగర్‌కర్నూల్ జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదనే నమ్మకం పోయింది. మూడున్నరేండ్లుగా ప్రిపేర్ అవుతున్నా. రెండు లక్షల ఉద్యోగాలని చెప్పడంతో ఆశ కలిగింది. కానీ నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి రేవంత్‌రెడ్డి పాలనలో కనిపించడం లేదు. ఇప్పటికే కొంతమంది మా స్నేహితులు చాలా బాధపడుతూ ఇండ్లకు వెళ్లిపోయి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. దీనికేనా కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ఇచ్చిన మాట తప్పడం రేవంత్ సర్కార్కే చెల్లింది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తాం.
– శ్రీశైలం, పోటీ పరీక్షల అభ్యర్థి
మాది మహబూబ్‌నగర్. గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అని చెప్పగానే నమ్మి గ్రామాలకు వెళ్లి మేము కూడా ఎన్నికల్లో ప్రచారం చేశాం. కానీ అదే మేం చేసిన తప్పు అని ఇప్పుడు తెలుసుకున్నాం. మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు. రెండేండ్లు కావస్తున్నా ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా త్వరలో అంటూ సాగదీస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోటిఫికేషన్స్ ఇవ్వాలి.
– కయ్యం వెంకటేశ్, పోటీ పరీక్షల అభ్యర్థి
రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. స్థానిక ఎన్నికల కోసం ఆరు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎన్నికలను గట్టెక్కడానికే ఇలాంటి మాటలు ఇస్తున్నారు. నిరుద్యోగుల కష్టాలను వారు పట్టించుకోవడమే లేదు. ఇంట్లోవాళ్లు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఉద్యోగమేది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక చాలామంది లోలోన కుమిలిపోతున్నారు. కొందరు ఊళ్లో కూలిపనులు చేసుకుంటున్నారు. రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్లంతా ఉద్యోగాలు సాధించేవారు. కానీ ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈ సర్కార్ మమ్మల్ని అవమానించింది.
– రవి రాథోడ్, పోటీపరీక్షల అభ్యర్థి
బాగా చదివి ఉద్యోగం సాధించాలని కోచింగ్ తీసుకుంటున్నా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చేది. ఒకటి కాకుంటే మరో ఉద్యోగానికి ప్రిపేర్ ఆయ్యేవాళ్లు. కాంగ్రెస్ వచ్చాక జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్ గ్యారెంటీ లేదు. చేసేదేమీ లేక ఇంటి అద్దె కోచింగ్ ఖర్చుల కోసం ఓ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఇబ్బందుల పాలుచేస్తున్నది. బీఆర్ఎస్ను కాదని గెలిపిస్తే నమ్మకద్రోహం చేస్తున్నరు.
– నిరోషా, సూర్యాపేట
మూడేండ్లుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. అద్దె రూములో ఉంటూ లైబ్రరీలో చదువుకుంటున్న. మా అమ్మానాన్న అప్పులు చేసి డబ్బులు పంపుతున్నరు. ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కోరికను తీరుద్దామనుకుంటే మా కలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్లగా మారుస్తున్నది. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసి, తామే ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తాం.
– మాలోత్ రమేశ్, మిర్యాలగూడ
మాది కడప జిల్లా పోరుమామిండ్ల. ఏడాది నుంచి అశోక్‌నగర్‌లో యూపీఎస్సీకి కోచింగ్ తీసుకుంటూ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరిట నమ్మించి మోసం చేసిందని మా స్నేహితులు చెప్తున్నారు. రెండేండ్లుగా రూ.వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చినా వారికి కొంత ఆసరా అయ్యేది. 2 లక్షల ఉద్యోగాలని ఎన్నికల ముందు చేసిన మోసానికి బలయ్యామని వారంతా బాధపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రతి విద్యార్థి, నిరుద్యోగులు ఎంతో ఆగ్రహంగా ఉన్నారు.
– టీ బాలయ్య, కడప
రెండేండ్లు పూర్తికాకుండానే విద్యార్థులకు ప్రభుత్వంపై నమ్మకంపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే జాబ్ క్యాలెండర్ ఉత్తుదే అయింది. నోటిఫికేషన్లపై స్పష్టతే లేదు. నోటిఫికేషన్లు ఇస్తారన్న నమ్మకం అసలే లేదు. అందుకే కోచింగ్ కోసం వచ్చిన నిరుద్యోగులంతా తిరిగి ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం చెప్పినదానికి, చేస్తున్నదానికి పొంతనే లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగం వస్తుందని అప్పులు చేసి డబ్బులు పంపిస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాలేక, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విద్యార్థులు వెనక్కి వెళ్లిపోతున్నారు.
– చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు, దిల్సుఖ్నగర్
అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల అంశంపై చర్చించాలి. తక్షణమే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. 80 శాతం స్థానిక కోటా ఇచ్చేలా అసెంబ్లీలో చట్టం తేవాలి. వెంటనే జీపీవోలో 6వేలు, పవర్ సెక్టార్ 5 వేలు, పోలీస్ విభాగం 15 వేలు, డీఎస్సీ 20 వేలు, గ్రూప్స్‌లో 4 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేయాలి. నోటిఫికేషన్లు రాని కారణంగా ఇన్స్టిట్యూట్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లు, మెస్‌ల నిర్వాహకులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే నిరుద్యోగులు ఇప్పుడు ఇండ్లకు తరలివెళ్తున్నారు. వారిలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.
– అశోక్, అశోక్ అకాడమీ చైర్మన్