నమస్తే నెట్వర్క్: కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక(ఒక్కరోజు) సమ్మె రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. సింగరేణిలో 22 ఓసీపీలు, 20 భూగర్భగనులు, డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగులు, 30 వేల కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి, సమ్మెలో పాల్గొనగా, 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సింగరేణి కార్మిక సంఘాలు గనులు, ఓసీపీలపై ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారి వద్దకు ర్యాలీగా చేరుకొని పెద్ద ఎత్తున కార్మికవర్గంతో కలిసి గంట పాటు రాస్తారోకో చేశారు. ఆయా చోట్ల పెద్ద సంఖ్యలో వివిధ రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.
కేంద్రం తీసుకురానున్న విద్యుత్ సవరణ చట్టం-2025పై కేటీపీపీ ఉద్యోగులు మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు, మధ్యాహ్నం ప్లాంట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంజినీర్లు, వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ తీశారు.
కేంద్ర తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే దాకా ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రకటించారు. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు పార్టీ అనుబంధ కార్మిక సంఘాలతో కలిసి బైక్, ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌భాసర్ మాట్లాడుతూ కార్మికలోకానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులు, బీఆర్టీయూ నాయకులకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం వెంటనే నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కార్ గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదని గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు గురువారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, గిరిజన, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా షెడ్యూల్ ట్రైబ్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన కేంద్రం.. నాలుగు లేబర్ కోడ్ల పేరుతో కార్మికులు 12 గంటలు పనిచేసేలా కొత్త చట్టాల్లో చేర్చి బానిసలుగా మారుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, శీనునాయక్, రూప్సింగ్, ధర్మానాయక్, కిషన్‌నాయక్, మోహన్ సింగ్, రఘు, రాజు, బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.