వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన అమెరికా డాక్టర్ మేజర్ జగత్‌కుమార్ పటేల్(Major Jagatkumar Patel) అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఓ పేషెంట్ ముక్కు లోంచి .. మెదడులో ఉన్న గోల్ఫ్ బంతి సైజు కణితిని తొలగించారు. పుర్రెను చీల్చకుండానే ఆ సర్జరీ చేయడం విశేషం. జగత్‌కుమార్ పటేల్ ఆధ్వర్యంలో సర్జరీ విజయవంతంగా జరిగింది. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు. న్యూరోసర్జన్ లెఫ్టినెంట్ కల్నల్ చార్లెస్ మిల్లర్ కూడా సర్జరీకి సహకరించారు.
మెరైన్ కార్ప్స్ స్టాఫ్ సర్జెంట్ ఆండీ ఆర్చార్కు చికిత్స చేశారు. ఆయన సుమారు 15 ఏళ్ల నుంచి ఆ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. వినూత్నమైన రీతిలో మినిమల్ ఇన్వేసివ్ ప్రొసిజర్ను నిర్వహించినట్లు ఆర్మీ డాక్టర్లు వెల్లడించారు. అనుభవజ్ఞులైన ఇద్దరు డాక్టర్ల సమక్షంలో సర్జరీ జరిగినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పేర్కొన్నది. పేషెంట్ మెదడులో కణతి సుమారు 4.4 సెంటీమీటర్లు ఉన్నది. అతని పిట్యూటరీ గ్రంధి సమీపంలో ఆ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ గ్రంధి.. ఆప్టిక్ నరాన్ని వత్తడం వల్ల.. పేషెంట్ కంటిచూపు ఇబ్బందులకు గురైనట్లు డాక్టర్లు గుర్తించారు.
భారతీయ సంతతి డాక్టర్ పటేల్.. వినూత్న పద్ధతిలో ఎండోస్కోపీ ద్వారా.. ముక్కు నుంచి మెదడులో గోల్ఫ్ బంతి సైజులో ఉన్న కణతిని తొలగించినట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొన్నది. ఈ సర్జరీకి పటేల్ ప్లాన్ చేసినట్లు పెంటగాన్ పేర్కొన్నది. కణణి ప్రదేశం నిర్ధారణ జరిగితే, అప్పుడు పుర్రెను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని, ముక్కు ద్వారా సర్జరీని పూర్తి చేయవచ్చు అని మేజర్ పటేల్ పేర్కొన్నారు. పటేల్ తన ఎండోస్కోపీ నైపుణ్యం ద్వారా కెమెరాలను ముక్కు నుంచి మెదడులోకి పంపగా, ఇక న్యూరోసర్జన్ మిల్లర్ .. కణతిని కట్ చేసి బయటకు తీశారని పెంటగాన్ పేర్కొన్నది.