CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు7 (నమస్తే తెలంగాణ): ‘పదవీ విరమణ చేసిన ఐఏఎస్, పోలీస్ అధికారులను తిరిగి ప్రభుత్వంలో నియమించడం దారుణం. కేసీఆర్ ప్రభుత్వం తక్షణం ఇలాంటి అధికారులను తొలగించాలి. మేము దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రిటైర్డ్ అధికారులను ప్రభుత్వం నుంచి తొలగించాలి’ ఇదీ పీసీసీ అధ్యక్షుడిగా, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నపుడు 2020 జూన్ 25న రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవే విధానాలను కొనసాగిస్తున్నారు. విరమణ పొందిన అధికారులనే నియమిస్తూ ద్వంద్వ వైఖరిని బయట పెట్టుకున్నారు. ఇప్పటికే పోలీస్, నీటిపారుదల శాఖల్లో పలువురిని నియమించగా, తాజాగా హైదరాబాద్ జలమండలిలోనూ మరో విశ్రాంత ఉద్యోగిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనలేదని రేవంత్‌రెడ్డి నిరూపించుకున్నారు. ఇదే విషయంపై ఉద్యోగవర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
విరమణ పొందిన ఉద్యోగులను సత్వరమే తొలగిస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇరిగేషన్ శాఖలో విరమణ పొందిన ఈఎన్సీతోపాటు, పదవీకాలం ముగిసిన ప్రభుత్వ సలహాదారుడిని తిరిగి యథావిధిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏకంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు పదవిని కట్టబెట్టింది.
ప్రతిపక్షంలో ఉన్నపుడు రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపును విమర్శించిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆయన కొనసాగించడంపై ఉద్యోగవర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్డ్ అయి ఓఎస్డీలుగా, ఇతర హోదాల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు మీడియాకు లీకులు ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చి శాఖలవారీగా అలాంటి ఉద్యోగుల జాబితాలను తెప్పించుకున్నారు. ఆ తర్వాత ఆ జాబితా అటకెక్కడం అటుంచితే తాజాగా విరమణ పొందిన వారిని యథావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం వరుసగా ఉత్తర్వులు ఇస్తూ పోవడం గమనార్హం. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయిందని ఉద్యోగవర్గాలు నిప్పులు చెరుగుతున్నారు.
ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య మే 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆ వెంటనే ఆయనకే తిరిగి నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ బాధ్యతలను అప్పగించింది. సర్కారు వచ్చిన కొత్తలో రాష్ట్ర శాసనసభకు సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను సలహాదారు పదవిలో ప్రభుత్వం నియమించింది. తాజాగా హైదరాబాద్ జలమండలిలో ఈడీగా పనిచేస్తున్న ఈఎన్సీ డాక్టర్ ఎం సత్యనారాయణ పదవీకాలం ఇటీవలే ముగిసింది. అయినా ప్రభుత్వం తిరిగి యథావిధిగా ఆయననే కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా సలహాదారుల పేరుతో, ఎక్స్టెన్షన్ల పేరుతో విశ్రాంత ఉద్యోగులను గతంలో మాదిరిగానే ప్రభుత్వం కొనసాగిస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేస్తుండటంపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.