హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి, సమ్మెల రాజ్యం వచ్చింది’ అని బీఆర్టీయూ (బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షు డు రాంబాబుయాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలోని అన్ని కార్మిక వర్గాలు ఆందోళనలో ఉన్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మెకు దిగేందుకు నోటీసులు ఇచ్చారని, వారి సమ్మెకు బీఆర్టీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. విద్యుత్తు శాఖలోని ఆర్టిజన్లకు మద్దతు ఇచ్చామని తెలిపారు.
మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ త్రిశంకుస్వర్గం చూపిందని దుయ్యబట్టారు. గెలిచాక రాష్ట్రంలోని ఏ ఒక్క కార్మికవర్గ సమస్యనూ ప్రభు త్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడే మో పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే అపాయింటెడ్డే ఫిక్స్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక మరచిపోయిందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలు తీర్చకపోగా వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు.
సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న విద్యుత్తు శాఖలోని ఆర్టిజన్లను పిలిచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెదిరింపులకు దిగారని రాంబాబుయాదవ్ విమర్శించారు. ఆశావర్కర్లు హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే, వారిని దౌర్జన్యపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. చర్చల పేరుతో వారిని పిలిపించి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్మికవర్గాలకు పగలు ధర్నాలకు అనుమతులు ఇచ్చి, అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారని బీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి మారయ్య విమర్శించారు. ఇది సీఎం రేవంత్రెడ్డి తెచ్చిన మరో కొత్త పథకం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో స్కాములే తప్ప, స్కీములు లేవని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకుడు పరశ్రామ్ తదితరులు పాల్గొన్నారు.