హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల సంఘాలన్ని ఏకమయ్యాయి. వేర్వేరు పద్ధతుల్లో డిమాండ్లు సాధించుకునేందుకు రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి. సమస్యల పరిష్కారానికి సొసైటీలవారీగా పలుమార్లు సెక్రటరీలకు సంఘం సభ్యులు వినతి పత్రాలు అందజేశారు. కాని రాష్ట్రప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో, వాటిని సాధించుకునేందుకు గురుకుల టీచర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయించాయి. ఇక నుంచి ఉమ్మడి పోరాటం చేయనున్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి.
తెలంగాణ గురుకుల సొసైటీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని సమస్యల పరిష్కారానికి ఒకటి కాదు.. ఏకంగా రెండు జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)లు ఏర్పాటు కావడం విశేషం. ఇందులో లెఫ్ట్ పార్టీలకు చెందిన వర్గం ఒకటైతే, నాన్ లెఫ్ట్ పార్టీలకు చెందిన వర్గం మరొకటిగా చెప్పుతున్నారు. ఈ సందర్భంగా ఓ వర్గానికి చెందిన జేఏసీ నాయకులు బాలరాజు, రుషికేశ్కుమార్, కే సంజీవ్, సైదులు, బాలరాజ్ మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి, సంబంధిత శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు..
రెండో జేఏసీ వర్గానికి చెందిన నాయకులు మాట్లాడుతూ.. డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని, అందు లో భాగంగా ఈ నెల 28న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కొనసాగింపుగా హైదరాబాద్లో ‘మహాధర్నా’ నిర్వహిస్తున్నట్టు ఆ జేఏసీ తరఫున యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ నాయకులు జంగయ్య, చావ రవి, గురుకుల టీచర్ల జేఏసీ తరఫున మామిడి నారాయణ, మధుసూదన్ తెలిపారు.