ధర్మారం,మార్చి 30 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వినూత్నంగా వాటర్ బెల్(Water Bell ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న క్రమంలో ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని పిల్లలలో డీహైడ్రేషన్ లోనుకాకుండా ఉండడానికి వాటర్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం7-45 కు పాఠశాల ప్రారంభమై మధ్యాహ్నం 12-30 వరకు ముగుస్తుంది.
ఈ క్రమంలో పాఠశాల పనిచేసే సమయంలో 3 సార్లు అనగా ఉదయం 9, 10, 11 వాటర్ బెల్ కొట్టగానే విద్యార్థులు వాటర్ బాటిల్ లో తెచ్చుకున్న నీటిని తాగుతున్నారు. కాగా, ఈ పాఠశాలలో సముద్రాల వంశీమోహనా చార్యులు తన సొంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు లోన్ అయ్యే ప్రమాదం ఉందనే ఆలోచనతో ఈ వాటర్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం వంశీ మోహనాచార్యులు తెలిపారు.