సుబేదారి, జనవరి 10: రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాల వద్ద రాత్రి సమయంలో తల్లీదండ్రులతో నిద్రిస్తున్న చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌నకు పాల్పడిన ఇద్దరు నిందితులను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, కాజీపేట పోలీసులు సం యుక్తంగా పట్టుకున్నారు. వీరి నుంచి ఐదుగు రు పిల్లలను రెస్క్యూ చేసి కాపాడారు. కారు, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మీడియా కు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 28న కాజీపేట రైల్వేస్టేషన్ బయట ఫుట్‌పాత్ వద్ద కన్నానాయక్ తన ఐదు నెలల బాబుతో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాబు ను కిడ్నాప్ చేశారు.
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. శనివారం కాజీపే ట రైల్వేస్టేషన్ వద్ద పెద్దపల్లి జిల్లా గవాపూర్కు చెందిన కొడుపాక నరేశ్, పెద్దపల్లిలోని శాంతినగర్‌కు చెందిన వేల్పుల యాదగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్ కేసులు వెలుగు చూశాయి.
కాజీపేటలో బాలుడితోపాటు ఆదిలాబాద్ జిల్లా లింగయ్యపల్లిలో 5 నెలల క్రితం ఓ బాలుడిని, 2025 ఆగస్టులో వరంగల్ రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న 10 నెలల పాపను, 2023 అక్టోబర్‌లో కాజీపేట రైల్వేస్టేషన్ వద్ద నిద్రిస్తున్న బాలుడిని, అక్టోబర్‌లో మంచిర్యాల రైల్వేస్టేషన్ వద్ద 5 నెలల పాప, 2025 జూన్‌లో రామగుండం రైల్వేస్టేషన్ వద్ద పాపను కిడ్నాప్ చేసి విక్రయించినట్టు వెల్లడైంది. ఇద్దరు నిందితుల నుంచి ఐదుగురు పిల్లలను కాపాడినట్టు సీపీ తెలిపారు.