హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెల్లో రెండేండ్ల తర్వాత సర్పంచుల పాలన మొదలైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచులు ఇప్పుడు గ్రామాల రూపురేఖలను మార్చడానికి సిద్ధమవుతున్నారు. ఆ సర్పంచ్ అంటే కేవలం అధికార దర్పం ప్రదర్శించడం కాదు, బాధ్యతాయుతమైన ప్రజా సేవకుడు అని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 (టీఎస్ పీఆర్యాక్ట్-2018) స్పష్టం చేస్తున్నది. ఈ చట్టంలోని సెక్షన్-32 సర్పంచ్ విధులను అత్యంత కీలకంగా నిర్దేశించింది. గ్రామ పాలకవర్గ భేటీ నెలకోసారి, రెండు నెలలకోసారి గ్రామసభ కచ్చితంగా నిర్వహించాలి.
గ్రామానికి గ్రామసభే కీలకం. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు కేవలం ఏసీ గదుల్లో కాకుండా, ప్రజల సమక్షంలో జరుగాలనే ఉద్దేశంతోనే గ్రామసభలకు చట్టంలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామసభలను క్రమం తప్పకుండా నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించడం సర్పంచ్ ప్రాథమిక విధి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకొని అందుకు అనుగుణంగా పనిచేయాలి.
విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోయినా, నిధుల్లో అక్రమాలు జరిగినా సర్పంచులను తొలగించే అవకాశం చట్టంలో పొందుపర్చారు. సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్‌పవర్ ఉన్నందున నిధులను పారదర్శకంగా ఖర్చు చేయకపోతే వారిపై సస్పెన్షన్ వేటు వేసే వెసులుబాటు చట్టంలో స్పష్టంగా ఉన్నది. గతంలో అక్రమాలు, ప్రజాధనం పక్కదారి పట్టించారన్న ఆధారాలతో చాలా మంది సర్పంచులు తొలగింపునకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పాలకవర్గాలు చట్టానికి లోబడి, ప్రజలకు, ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే చట్టంలో కఠిన నిబంధనలు పెట్టారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురుగు కాలువలు, మంచినీటి సరఫరా వంటి పనుల్లో నాణ్యతను కూడా సర్పంచ్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. సర్పంచ్‌కు సంపూర్ణ కార్యనిర్వహణాధికారాలు కల్పించినందున కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకంగా పనులు చేస్తే, అధికారుల విచారణలో అది ని జమని తేలితే వేటు పడే అవకాశం ఉన్నది. కాబట్టి పంచాయతీ నిధుల వినియోగంలో అత్యంత పారదర్శకత అవసరం. ఏటా మూడో త్రైమాసికంలో పంచాయతీ ఖాతాలను మూసివేయ డం, ఆడిట్ చేయించడం సర్పంచ్ బాధ్యత.