హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులతో కలిసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సచివాలయం నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పెరిగిన ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించామని, రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 14.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలో రూ.2001.96 కోట్లు జమ చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.