ఇంద్రవెల్లి/ఉట్నూర్ రూరల్/బజార్హత్నూర్/ వీర్నపల్లి/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే రెండ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే 1-2 డిగ్రీలు తక్కువగా ఉండి, క్రమంగా పెరుగుతాయని పేర్కొన్నది.
బుధవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గడిచిన 24గంటల్లో మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వివరించింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులపై వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో వడగండ్ల వానతో వరి ధాన్యం నేలరాలింది. లాల్సింగ్తండాలో భూక్యా మోహన్‌కు చెందిన నాలుగెకరాలు, భూక్యారెడ్డి రెండెకరాలు, చిన్రెడ్డి నాలుగెకరాలతో పాటు తండాలో 30ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడ, దుబ్బగూడ, ఇన్కర్గూడ, ధనోరా(బీ), హీరాపూర్, కేస్లాపూర్, ఏమాయికుంట, ముత్నూర్, దేవాపూర్‌లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించి నిత్యావసర సరుకులు తడిచాయి. ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. గోధుమ, జొన్న, శనగ పంటలకు నష్టం వాటిల్లింది. ఉట్నూర్ మండలంలో మామిడి, వరి, గోధుమ, జొన్న, మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నాయి. బజార్హత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామాల్లో వర్షం కురిసింది.

మంగళవారం కురిసిన అకాల వర్షానికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రాంతంలో జలమయమైన రోడ్డు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని టీ-హబ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్