హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాఖ తిరస్కరించింది. ఆ ప్రతిపాదనలపై త్రిమెన్ కమిటీ సభ్యుల్లో ఇద్దరి సంతకాలు లేకపోవడంతో ప్రపోజల్స్‌ను రిజెక్ట్ చేసింది. దీంతో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ర్టానికి జాతీయ అవార్డులు రావడం అనుమానంగానే ఉంది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం రాష్ట్రం నుంచి 153 మంది టీచర్లు దరఖాస్తు చేసుకోగా, 107 మంది సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు.
ఇందులో నుంచి ఆరుగురిని ఎంపిక చేసేందుకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్‌తో కూడిన త్రిసభ్య కమిటీని కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఈ నెల 4లోగా జాబితా పంపించాలని గడువు విధించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి యోగితారాణా, నవీన్ నికోలస్ బ్రెజిల్ పర్యటనలో ఉండగా, వీరి సంతకాలు లేకుండానే సోమవారం రాత్రి ఆరుగురి పేర్లతో కూడిన జాబితాను పంపడంతో కేంద్రం తిరస్కరించింది.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న వివిధ యూజీ కోర్సులకు సంబంధించి ఎన్ఆర్ఐ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 8న ‘వాక్-ఇన్-కౌన్సెలింగ్’ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీహెచ్ విద్యాసాగర్ మంగళవారం ప్రకటించారు. రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూ పరీక్షల నియంత్రణ విభాగంలో ఈ వాక్-ఇన్-కౌన్సెలింగ్ ఉదయం 11 గంటల నుంచి జరగనున్నదని తెలిపారు. పూర్తి వివరాలను పీజేటీఏయూ అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in లో పొందవచ్చని సూచించారు.