BJP | సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాకేంద్రంలో గురువారం బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 50 వేల మందితో నిరుద్యోగ మార్చ్ జరుపుతామని గొప్పలకు పోయిన కమలం పార్టీ.. తీరావచ్చిన జనాన్ని చూసి షాక్‌కు గురైంది. యువత, జనం లేకపోవడంతో నిరుద్యోగ మార్చ్ ర్యాలీ ప్రారంభించే ఐబీ చౌరస్తాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. జనంలేరని తెలియడంతో మొదట సంగారెడ్డి సమీపంలోని ఓ దాబాలో, ఆ తర్వాత సంగారెడ్డిలోని రెడ్లాస్ హోటల్లో రెండు గంటలపాటు బండి సంజయ్ వేచిచూశారు.
సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయశాంతి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు బండి రాకకోసం ఎదురుచూసి అసహనానికి లోనయ్యారు. చివరకు సంజయ్ రాకపోవడంతో విజయశాంతి నిరుద్యోగ మార్చ్‌కి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బండి హాజరైన సమావేశానికి ఆమె హాజరుకాలేదు. నిరుద్యోగ మార్చ్‌లో యువత జాడ కనిపించలేదు. 40 ఏండ్లకు పైబడి వారు, వృద్ధ్దులు ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలోని బీజేపీ నాయకులు డబ్బులు ఇచ్చి వారిని సంగారెడ్డికి వాహనాల్లో తరలించారని తెలిసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ, ఎన్కేమురి, కంగ్టి తదితర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ర్యాలీలో కనిపించారు.