హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రవాణా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్మిక వ్యతిరేక చట్టాలతో శ్రామికులపై ఉక్కుపాదం మోపిన నరేంద్రమోదీ సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించాయి. రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట మంగళవారం పలు రవాణా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి.
ఏఐటీయూసీ, బీఆర్టీయూ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఏడీఎస్, ఏడబ్ల్యూఏ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్, గిగ్ ఫౌండర్ షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. డ్రైవర్లకు ప్రయోజనం చేకూర్చే ‘సోషల్ సెక్యూరిటీ కోడ్’ను అమలు చేయకుండా కేంద్రం పైశాచిక ఆనందం పొందుతున్నదని ధ్వజమెత్తారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఆటో పర్మిట్లపై నిషేధాన్ని ఎత్తివేయాలని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత బీ వెంకటేశం, సీఐటీయూ నాయకుడు శ్రీకాంత్, టీఏసీఎస్ నేత సత్తిరెడ్డి, ఐఎఫ్టీయూ నాయకుడు కిరణ్, క్యాబ్ యూనియన్ నేత వరుణ్, ట్యాక్సీ అసోసియేషన్ నాయకుడు నగేశ్ తదితరులు పాల్గొన్నారు.