హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో గురువారం నుంచి బదిలీలు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ అలాట్మెంట్ కాకుండా.. ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన సీనియార్టీ జాబితాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ విభాగంలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన సీనియార్టీ జాబితా పూర్తిగా తప్పులతడకగా ఉన్నదని కొన్నిరోజులుగా నర్సులు డీపీహెచ్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్నారు. పేర్లు, సీనియార్టీ, సర్వీస్ వంటి వివరాలు తప్పుగా నమోదయ్యాయని చెప్తున్నారు. సగం జాబితా తప్పుల తడకగా ఉన్నదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సీనియార్టీ జాబితా ప్రకటించిన మొదటిరోజే భారీ స్థాయిలో తప్పులు దొర్లాయని నర్సులు చెప్తున్నారు. కొందరికి వందేండ్లకుపైగా సర్వీస్‌లో ఉన్నట్టు పడిందని అంటున్నారు. దీనిపై డీపీహెచ్ కార్యాలయం ముందు నిరసన తెలుపగా.. ఆ జాబితాను మార్చారని, కానీ రెండోసారి ప్రకటించిన జాబితాలోనూ ఇదే పునరావృతం అయ్యిందని తెలిపారు. మళ్లీ విమర్శలు రావడంతో ముచ్చటగా మూడోసారి కూడా సీనియార్టీ జాబితా మార్చారని అయినా తప్పులు పోలేదని చెప్పారు. మూడుసార్లు జాబితా మార్చినా తప్పులు కొనసాగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో డీపీహెచ్ కార్యాలయంలోని కొందరు అవినీతి సిబ్బంది, యూనియన్ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలోనే ఒకేచోట పనిచేసిన కాలాన్ని కావాలనే తక్కువ రాయించుకున్నట్టు సమాచారం. ‘కౌన్సెలింగ్ సమయంలో మనల్ని ఎవరూ అడగరు. ఆన్లైన్లో మనం రాసిందే లెక్క. నిజమా? కాదా? అని పరిశీలించే వ్యవస్థే లేదు’ అన్న భావనతో ఇష్టం వచ్చినట్టు సర్వీస్‌ను రాశారని అంటున్నారు. ఇది ఈ ఒక్క విభాగానికే పరిమితమా? మిగతా విభాగాల్లోనూ ఇలాగే జరిగిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తి ఇచ్చిన వివరాలు నిజమో కాదో నిర్ధారించేందుకు వైద్యారోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి వ్యవస్థనూ ఏర్పాటు చేయలేదు. ఇదే అక్రమార్కులకు ఆసరాగా మారిందని, ఇదంతా పెద్ద కుంభకోణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా సర్వీస్‌ను నిర్ధారించే ఏర్పాట్లు చేయాలని, పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరుతున్నారు.
వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) లోని జిల్లా క్యాడర్ ఉద్యోగులది విచిత్ర పరిస్థితి. టీవీవీపీ పరిధిలో మల్టీజోన్, జోనల్ స్థాయి పోస్టులకు 317 జీవో అమలు ప్రక్రియ పూర్తయినా.. జిల్లా క్యాడర్‌కు అమలు కాలేదు. ల్యాబ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్ వంటి 17 రకాల పోస్టులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం చేపడుతున్న సాధారణ బదిలీల్లో తమకు అవకాశం రావడం లేదని వాపోతున్నారు.