హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు 15 తర్వాత దృష్టి పెడతామని సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం వేం నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యింది.
ఈ సందర్భంగా నూతన పీఆర్సీ, పెండింగ్‌లోని నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరగా స్పందించిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన ఉందని, చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, దివ్యదేవరాజన్‌తో కూడిన కమిటీతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారన్నారు. సమావేశంలో టీజీవో సెక్రటరీ నరహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాచర్ల రామకృష్ణాగౌడ్ పాల్గొన్నారు.