Suryapet | సూర్యాపేట, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటకు అభివృద్ధి పరుగులు తీస్తుంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వేల కోట్ల రూపాయాలు తీసుకువచ్చి గతంలో ఎన్నడూ ఏ ప్రజాప్రతినిధి చేయని అభివృద్ధిని ప్రజల కండ్ల ముందు సాక్షాత్కరింపజేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రెండుసార్లు సాధారణ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని అనేక హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుండగా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో స్థానికంగా మరిన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట అభివృద్ధిలో దూసుకుపోతుంది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు కరువు. గత పాలకులు దీనిపై కనీసం దృష్టి సారించలేదు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థిగా రంగంలో ఉన్న గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో అహ్లాదకరమైన పార్కులు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వగా నేడు పట్టణంలో చిన్న, పెద్ద పార్కులు దాదాపు 45కు పైనే రూపుదిద్దుకున్నాయి. అలాగే సూర్యాపేట పట్టణంలోనే ఉన్న సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడంతో ప్రజలకు ఆహ్లాదం, ఉత్సాహం పంచుతుంది.
చెరువు నిండా నీళ్లు, కట్టకు రెండు వైపులా పెరుగుతున్న పచ్చని చెట్లు., రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే లైటింగ్ చమక్కులతో అటుగా వెళ్తున్న వారు చెరువు అందాలను చూసి తీరాల్సిందే. ఇలా ఇప్పటికే మినీ ట్యాంక్‌బండ్‌గా పూర్తిస్థాయిలో పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుండగా అక్కడ అదనపు మెరుగులు దిద్దేందుకు తాజాగా మరో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. మినీ ట్యాంక్‌బండ్ చుట్టూ గ్రీనరీ పెంపునకు రూ.1.10 కోట్లు, బండ్‌పైకి వచ్చే వారు కూర్చుని సేదతీరేలా వివిధ ఆకృతుల్లో కూర్చీల ఏర్పాటుకు రూ.40 లక్షలు, వీక్షకులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా రెస్టారెంట్ కాంప్లెక్స్‌తో పాటు చెరువు వద్ద ఆరు ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటుకు రూ.90 లక్షలు, చిన్నారుల ఆటవిడుపుల ప్రాంగణాల ఏర్పాటుకు రూ.60 లక్షలు ఇలా మొత్తం రూ.3 కోట్లు కేటాయించారు.
సూర్యాపేటలో ఇప్పటికే సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. పట్టణాన్ని అనుకుని ఉన్న మరో చెరువు పుల్లారెడ్డి చెరువును కూడా ట్యాంక్‌బండ్‌గా మార్చాలనే ఆలోచనను మంత్రి చేశారు. ఈ ఆలోచనను 2017లో కొత్త కలెక్టరేట్ భవన సముదాయాలకు శంకుస్థాపన కోసం వచ్చిన సీఎం కేసీఆర్‌ను ఒప్పించడంతో అదీ కార్యరూపం దాల్చింది. ఈ మేరకు రూ.17.58 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మిషన్ కాకతీయ కింద రూ.83.83 లక్షలతో పూడికతీత పనులు చేపట్టారు. అనంతరం రూ.16.74 కోట్లతో చెరువు కట్టలు విస్తరించి గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, బోట్ సౌకర్యం తదితర సుందరీకరణ పనులు చేపట్టనుండగా ప్రస్తుతం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే పుల్లారెడ్డి చెరువు ట్యాంక్‌బండ్‌గా మారి ప్రజలకు ఆహ్లాదం పంచబోతుండడం పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డిని పట్టణవాసులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
గతంలో పట్ణణ ప్రజలు సాయంకాలం బయటకు వెళ్లి కొద్దిసేపు కాలక్షేపంగా, సరదాగా గడపాలంటే ఎక్కడా కూడా మంచి ఆహ్లాదకర వాతావరణం లేదు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా మారిపోవడంతో నేడు పట్టణ ప్రజలు కుటుంబంతో సాయంకాలం సరదాగా గడుపుతున్నారు. ఒకవైపు సద్దల చెరువును, మరోవైపు పుల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్ చేయడం పట్టణ ప్రజలకు వరంలా భావించవచ్చు. మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– గుమ్మడవెల్లి కృష్ణ, సూర్యాపేట
గత పాలకుల పాలనలో సూర్యాపేటలో కుటుంబంతో బయటకు వెళ్లేందుకు ఆహ్లాదకరమైన ప్రదేశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఒక ట్యాంక్‌బండ్ నిర్మాణం అవుతున్న క్రమంలోనే మరో ట్యాంక్‌బండ్ నిర్మాణం ప్రారంభించడంతో చాలా అనందంగా ఉంది. మంత్రి జగదీశ్‌రెడ్డి అభివృద్ధిని సూర్యాపేట ప్రజలకు పరిచయం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పుల్లారెడ్డి, సద్దల చెరువుపై చేపట్టిన నిర్మాణాలు పూర్తైతే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
– యలమద్ది అశోక్‌కుమార్, సూర్యాపేట