Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 20 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అర్ధరాత్రి హత్యలతో ఉలిక్కిపడుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం సురక్షితమని ఉత్తరాది ఐటీ ఉద్యోగులు వేన్నోళ్ల పొగిడిన సందర్భాలు గుర్తు చేసుకుంటూ… ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది?’ అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కొన్నిరోజుల కిందటనే ఒకేరోజు మూడు హత్యలతో పాటు వివిధ ప్రాంతాల్లో ధార్… బురఖా… చుడీదార్… భవారియా… ఇలా కొత్త కొత్త గ్యాంగులు ప్రవేశించి దోపిడీలకు పాల్పడుతుండగా… మరోవైపు హత్యల పరంపర నగరవాసులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నడిరోడ్డుపై నాలుగు హత్యలు చోటుచేసుకోవడం మరోసారి నగరాన్ని భయం నీడలోకి తీసుకువెళ్లింది. ఇందులో ఆసిఫ్‌నగర్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఒక హత్య జరుగగా… ఈ పరిధిలోనే నాలుగు రోజుల కిందట మరో హత్య జరగడం… పైగా ఈ రెండు హత్యలు కూడా పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరుగడం గమనార్హం.