Telangana | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు. గాలిలో తేమ తగ్గడం వల్ల ఉక్కపోత పెరుగుతున్నదని, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పులు ఉండవని తెలిపారు. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటలల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు చెప్పారు.