హైదరాబాద్, మే 31 (నమస్తేతెలంగాణ): ‘హైదరాబాద్‌లో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే బెస్ట్.. 28 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించారు..’ అని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆయన ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడారు. తెలంగాణ సచివాలయం పనులను కేసీఆర్ ప్రభుత్వం 2021లో ప్రారంభించి 2023 నాటికి పూర్తిచేసిందని చెప్పారు. కేవలం రెండేండ్లలో రూ.616 కోట్లతో సకల హంగులతో, అద్భుతంగా సిద్ధంచేశారని గుర్తుచేశారు. అక్కడినుంచి పరిపాలన జరుగడంలేదా? సెక్రటేరియట్ కోసం హైదరాబాద్ నగరాన్ని నిర్మించారా? అని ప్రశ్నించారు.
సచివాలయం ఉన్నందునే తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అమరావతి పేరిట నిధుల దుర్వినియోగం చేస్తున్నారని, సచివాలయం కోసం నగరాన్ని నిర్మిస్తున్నారని ఎద్దేవా చేశారు. తులసిరెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ‘కేసీఆర్ పాలన దేశానికే మాడల్.. దటీజ్ కేసీఆర్ గ్రేట్‌నెస్.. తులసిరెడ్డి మీకు హ్యాట్సాప్..’ అంటూ మీమ్స్ జోడించి కామెంట్స్ చేశారు.